Pink Full Moon 2024 : ఈ నెలలో ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. పూర్ణమి వేళ ఈసారి దర్శనమిచ్చే పూర్ణ చంద్రుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి ఏర్పడే పూర్ణ చంద్రుడిని 'పింక్ మూన్' అని పిలుస్తారు. మన దేశ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:19 గంటలకు పింక్ మూన్‌ను మనం చూడొచ్చు. అమెరికా, కెనడా సహా ఇతర తూర్పు దేశాల్లోనైతే మంగళవారం సాయంత్రం 7:49 గంటలకు పింక్ మూన్ కనిపిస్తోంది. మన దేశంలోని ఔత్సాహికులు ఒకవేళ ఈ అద్బుత దృశ్యాన్ని చూడాలని భావిస్తే బుధవారం ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ఉదయం 5:19 గంటలకు చంద్రాస్తమయం జరగడం మొదలవుతుంది. ఆ సమయంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతున్న సంపూర్ణ చంద్రుడిని మనం చూడొచ్చు. అదే సమయంలో ఆకాశంలో లిరిడ్ ఉల్కాపాతం కూడా సంభవిస్తుంది. అంటే ఉల్కలు రాలడం కూడా మనకు కనిపిస్తుంది. పింక్ మూన్ ఈసారి స్పైకా నక్షత్రం దగ్గరగా ఉన్న కన్య రాశిలో కనిపిస్తుందని నాసా అంచనా వేస్తోంది. సోమ, మంగళ, బుధవారాల్లో దీన్ని చూడొచ్చు. అయితే అత్యంత ప్రకాశవంతమైన సంపూర్ణ చంద్రుడిని చూడాలంటే మాత్రం మంగళవారమే(అమెరికా కాలమానం ప్రకారం) ఉత్తమ సమయం అని నాసా పేర్కొంది.
విదేశీయుల విశ్వాసాలివే
పింక్ మూన్ అంటే చాలామంది చంద్రుడి గులాబీ రంగులో కనిపిస్తాడని భావిస్తుంటారు. కానీ అలాంటిదేం జరగదు. వసంత కాలంలో వచ్చే తొలి పున్నమిని ఇంగ్లిష్ వాళ్లు పింక్ మూన్ అని పిలుస్తారు. వసంత కాలం ప్రారంభం కాగానే ఉత్తర అమెరికా ప్రాంతంలోని అడవుల్లో వికసించే 'క్రీపింగ్ ఫ్లోక్స్' లేదా 'మోస్ ఫ్లోక్స్' అనే జాతి పువ్వులు గులాబి రంగులో ఉంటాయి. అందుకే ఈ సమయంలో వచ్చిన ఫుల్ మూన్‌కు పింక్ మూన్ అనే పేరును పెట్టారు. అమెరికాలోని వివిధ తెగలకు చెందిన ప్రాచీన శాస్త్రాల ప్రకారం ప్రతి పున్నమి చంద్రుడికి ఒక్కోపేరు ఉంది. వాటన్నింటిలోనూ చాలా ఫేమస్ పింక్ మూన్. యూదులు పింక్ మూన్‌ను 'పాసోవర్ మూన్' అని పిలుస్తుంటారు. పాసోవర్ మూన్ అంటే ఈస్టర్‌కు ముందు వచ్చే సంపూర్ణ చంద్రుడు అని అర్థం. అమెరికాలోని ప్రాచీన తెగ ఓగ్లాలా ఈ ఫుల్ మూన్‌ను 'రెడ్ గ్రాస్ అప్పీయరింగ్ మూన్' అని పిలుస్తుంటుంది. ఆ దేశానికే చెందిన ట్లింగిట్స్ అనే మరో తెగ ప్రజలు దీన్ని 'స్ప్రౌటింగ్ గ్రాస్ మూన్' అని పిలుస్తారు.
భారత్, శ్రీలంకలో ఇలా
మన దేశంలో పింక్ మూన్‌ను హనుమంతుని పవిత్రమైన జన్మదిన వేడుకతో ముడిపెట్టి చూస్తారు. శ్రీలంక ప్రజలు 'బక్ పోయా' పండుగతో ఈ ఫుల్‌మూన్‌కు సంబంధం ఉందని భావిస్తుంటారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజునే బుద్ధుడు శ్రీలంకను సందర్శించి తమ దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపారని శ్రీలంకలోని బౌద్ధులు విశ్వసిస్తారు.
పక్షులకు వడదెబ్బ- ఈ ఆస్పత్రిలో స్పెషల్ ట్రీట్మెంట్తో బిగ్ రిలీఫ్! - Special Hospital For Birds