Modi On Elections Results : గీతాభూమి (హరియాణా)లో సత్యం, అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల విజయంగా అభివర్ణించారు. హరియాణా, జమ్మూకశ్మీర్ ఫలితాల నేపథ్యంలో దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆ సమయంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
"గీతాభూమి (హరియాణా)లో సత్యం, అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయి. హరియాణా రైతులు కాంగ్రెస్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. తాము దేశంతో, భాజపాతో ఉన్నామని నిరూపించారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి భాజపాకు అధికారాన్ని కట్టబెట్టి ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా అరుదు. అస్సాంలో అధికారంలోకి వచ్చి 13ఏళ్లు అయ్యింది. కొన్ని రాష్ట్రాల్లో 60ఏళ్ల నుంచి అధికారంలోకి రాలేదు. ఒక్కసారి కాంగ్రెస్‌ను ఓడిస్తే మళ్లీ అధికారంలోకి రానివ్వరు. నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Addressing party workers at BJP headquarters in Delhi, Prime Minister Narendra Modi says " the poor in haryana have seen the work of double engine government for the last 10 years. from free medical facilities to tap water and concrete houses, haryana's poor families have… pic.twitter.com/8qUYigyJme
— ANI (@ANI) October 8, 2024
భారత సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రపంచవ్యాప్తంగా కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన కాంగ్రెస్, దాని పక్షాలు ఇందులో భాగమేనని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్నికలు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల విజయమని మోదీ పేర్కొన్నారు. ఓట్ల విషయంలో జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
#WATCH | Addressing party workers in Delhi, Prime Minister Narendra Modi says, " peaceful elections were held in jammu and kashmir, votes were counted and results were declared and this is the victory of the indian constitution and democracy. the people of jammu and kashmir gave… pic.twitter.com/uJUoHoAuK5
— ANI (@ANI) October 8, 2024
కాగా, జమ్మూకశ్మీర్‌లో అధికార పీఠం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి సొంతమైంది. ఎన్సీ 42 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 6 సీట్లను సొంతం చేసుకొంది. 29 చోట్ల బీజేపీ గెలుపొందింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ పని తీరుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల కృషిని కొనియాడారు.