Patient Trapped Inside The Lift : అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ రోగి సుమారు రెండు రోజుల పాటు లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయాడు. 42 గంటల తర్వాత లిఫ్ట్‌లో ఇరుక్కున్న రోగి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని ఎవరూ గమనించకపోవడం వల్ల లిఫ్ట్‌లోనే చిక్కుకోపోయి తీవ్ర అవస్థలు పడ్డాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది.
ఇదీ జరిగింది
ఉళ్లూరు ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల రవీంద్రన్ నాయర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే గత శనివారం ఉదయాన్నే వైద్య పరీక్షల కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు పూర్తైన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం పరీక్షల ఫలితాలను తీసుకుని వైద్యులకు చూపించానికి ఆస్పత్రికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అవుట్ పేషెంట్ బ్లాక్‌లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో ఎలివేటర్‌లో సమస్య తలెత్తి ఒక్కసారిగా ఆగిపోయింది. అలారంను అనేక సార్లు నొక్కనా ప్రయోజనం లేదు. లిఫ్ట్ బలంగా ఊగడం వల్ల రవీంద్రన్ ఫోన్ కిందపడి పగిలింది. దీంతో తాను చిక్కుకుపోయినట్లు ఎవరికీ చెప్పే అవకాశం లేకుండాపోయింది.
లోపలి నుంచి సాయం కోసం అరిచినా ఎవరికీ వినబడకపోవడం వల్ల అతడు ఇరుక్కుపోయిన సంగతి తెలియరాలేదు. సోమవారం ఉదయమే లిఫ్ట్ ఆపరేటర్ రొటీన్ వర్క్ కోసం ఆసుపత్రికి వచ్చారు. అప్పుడు అది పనిచేయడం లేదని గుర్తించి రిపేర్ చేసి లిఫ్ట్ డోర్ తెరవగా అందులో రవీంద్రన్ స్పృహతప్పి కన్పించాడు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తునకు అదేశించిన మంత్రి
అయితే, లిఫ్ట్ పని చేయని విషయాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది గుర్తించలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని మెడికల్ కాలేజీ అధికారులను అదేశించారు. మరోవైపు రవీంద్రన్ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు మెడికల్ కాలేజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.