Pashupati Paras Resign : ఎన్డీఏ కూటమికి షాక్ తగిలింది. బీజేపీ తమ పార్టీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి పదవికి ఆర్ఎల్జేపీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఇందులో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీకి ఐదు సీట్లు కేటాయించారు. ఈ సీట్ల విషయంలో అసంతృప్తికి గురైన చిరాగ్ బాబాయి పశుపతి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.
'మా పార్టీకి అన్యాయం జరిగింది'
'ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నేత. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎన్డీఏ కూటమి బిహార్ లోక్‌సభకు 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మా పార్టీకి అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలున్నారు. అయినా పొత్తులో భాగంగా ఒక్క సీటు ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా' అని పశుపతి పరాస్ మంగళవారం వెల్లడించారు.
చిరాగ్ పాసవాన్ పార్టీతో బీజేపీ పొత్తు
ఎన్డీఏ మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందారు రాం విలాస్ పాసవాన్. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కూటమిలో ఉన్న పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే, ఇటీవల ఎన్డీఏ విస్తరణలో భాగంగా చిరాగ్ మళ్లీ కూటమిలో చేరారు. తాజాగా సర్దుబాటులో భాగంగా సీట్లు కేటాయించారు.
అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హాజీపుర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్‌కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఇది ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.అయితే ఈ క్రమంలోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. విపక్ష ఇండియా కూటమిలో చేరనున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పరాస్ హాజీపుర్ నుంచి గెలుపొందారు.
'రాజకీయ లబ్ధి కోసమే నా మాటలను మోదీ వక్రీకరించారు'- 'శక్తి' వ్యాఖ్యలపై రాహుల్ క్లారిటీ
బిహార్‌లో NDA సీట్ల పంపకం పూర్తి- మెజారిటీ స్థానాల్లో బీజేపీ పోటీ- ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?