Opinion Poll Exit Poll Difference : ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి మెజార్టీ రాబోతోంది? అంటూ అనేక విశ్లేషణలు, అంచనాలు వెలువడుతుంటాయి. ఎన్నికల సీజన్ ప్రారంభమైన మొదలు ముగిసే వరకు ఈ చర్చ కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే లోక్‌సభతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
ఒపీనియన్ పోల్స్ : కొన్ని మీడియా సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రజల నాడిని తెలుసుకునేందుకు అభిప్రాయాలు సేకరిస్తుంటాయి. వీటినే ఒపీనియన్ పోల్స్ అంటారు. ఇలా ఒక్కో ఓటరు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అంచనాలు వెలువరిస్తారు.
టైమింగ్ : ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచి ఓటర్లు ఆలోచనలు, ఉద్దేశాలను తెలుసుకునేందుకు వార్తాసంస్థలు, పలు సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్‌ను చేపడతాయి.
ఓటర్ల శాంపిల్స్ : సర్వే సంస్థలు ఓటరు నాడిని పట్టుకునేందుకు వేలాది మందిని సర్వే చేస్తుంటాయి.
క్వశ్చనింగ్ : ఓటరు ఏ పార్టీ/ అభ్యర్థికి ఓటేయాలనుకుంటున్నారు? ఈ ఒపీనియల్ పోల్స్ ఓటర్ మూడ్‌ను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.
ప్రిడిక్టివ్ వాల్యూ: ఒపీనియన్ పోల్ ఓటర్ మూడ్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగానీ కచ్చితమైన ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తుందని చెప్పలేం. ఓటరు చివరి నిమిషంలో మనసు మార్చుకుని వేరే పార్టీకి ఓటేయవచ్చు. అప్పుడు ఎన్నికల ఫలితాలు తారుమారవుతాయి.
ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?
ఎగ్జిట్ పోల్: ఎన్నికల పోలింగ్ రోజు బూత్ నుంచి బయటికొచ్చే ఓటరు నుంచి అభిప్రాయాలు సేకరించడాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. ఓటరు ఎగ్జిట్ పోల్‌లో ఏ పార్టీకి ఓటేశాననే విషయాన్ని నిజాయితీగా చెప్పే అవకాశం ఉంది.
టైమింగ్: ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు ముగిసిన రోజు వెలువడతాయి. ఓటింగ్‌ను బట్టి ఫలితాలను అంచనా వేసే అవకాశం కూడా ఉంది.
ఓటర్ల శాంపిల్స్ : ఎగ్జిట్ పోల్స్ ఓటు వేసి వచ్చిన తర్వాత డేటాను సేకరిస్తాయి. అందుకే కొంత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యే అవకాశం ఉంది.
క్వశ్చనింగ్: ఎగ్జిట్ పోల్‌లో భాగంగా సర్వే సంస్థలు ఏ అభ్యర్థికి లేదా పార్టీకి ఓటేశారని ఓటరును అడుగుతాయి.
ప్రిడిక్టివ్ వాల్యూ: ఓటేసిన తర్వాత ఓటరు అభిప్రాయాన్ని తెలుసుకోవడం వల్ల ఎగ్జిట్ పోల్స్‌లో కొంత వరకు కచ్చితత్వం ఉండే అవకాశం ఉంది.
నిబంధనలు: ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126ఏలో ఓ నిబంధన ఉంది. ఏ రాష్ట్రంలోనైనా చివరి దశ ఓటింగ్ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించవచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ 1957లో రెండో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలో మొదటిసారిగా ఎగ్జిట్ పోల్‌ను నిర్వహించింది.
కొన్నిసార్లు అంచనాలు తారుమారు
అయితే ప్రతిసారీ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంచనాలు వాస్తవ ఫలితాలను వెల్లడించకపోవచ్చు. కొన్నిసార్లు ఫలితాలు తారుమారవ్వవచ్చు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS)' సంస్థ గతంలో కొంత మేర కచ్చితమైన అంచనాలను చెప్పగలిగింది. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేయగలిగింది.
అయితే 2004 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ పగ్గాలు చేపట్టనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ సంస్థలు తేల్చాయి. అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో ఎగ్జిట్ పోల్స్ యూపీఏ గెలస్తుందని అంచనా వేయనప్పటికీ 263 సీట్లు సాధించి మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 257- 340 సీట్లు గెలుస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి. అయితే ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 336 సీట్లు గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ దాదాపు 285 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఎన్డీఏ 353 సీట్లను కైవసం చేసుకుని వరుసగా రెండో సారి అధికారం చేపట్టింది.