One Nation One Election Bill In Parliament : 'వన్ నేషన్- వన్ ఎలక్షన్' కోసం ప్రవేశపెట్టే బిల్లులు లోక్ సభ ముందుకు మంగళవారం రానున్నాయి. అయితే జమిలి ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్ సభతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులకు సంబంధించిన నిబంధన ఒకటి ఉంది. అదేంటంటే?
129వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం
సెక్షన్ 2 సబ్ క్లాజ్ 5 ప్రకారం లోక్‌సభతో పాటు ఏదైనా శాసనసభకు ఎన్నికలు నిర్వహించలేమని ఈసీ అభిప్రాయపడితే తర్వాత అసెంబ్లీలకు ఎన్నికలు జరపవచ్చు. శాసనసభ ఎన్నికలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీ రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి. ఈ క్రమంలో రాష్ట్రపతి అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేయాలి.
సవరించాల్సిన అధికరణలు
అలాగే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికరణం 83, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు అధికరణం 172, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికరణం 327 సవరించాల్సి ఉంటుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు తర్వాత లోక్‌సభ మొదటి సమావేశం జరిగే తేదీపై రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ నోటిఫికేషన్ తేదీని అపాయింటెడ్ డేట్ అంటారు. ఆ నిర్ణీత తేదీ నుంచి లోక్‌సభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.
డిసెంబర్ 17న లోక్‌సభ ముందుకు
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' కు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం దీన్ని ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేసే అవకాశాలున్నట్లు వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మంగళవారం ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.
జేపీసీకి జమిలి బిల్లులు
జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్నవేళ దీనిపై విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రమంత్రి అభ్యర్థించనున్నారు. అనంతరం దీనిపై ప్యానెల్ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని సభాపతి పార్టీలను కోరనున్నారు. సాయంత్రానికి కమిటీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది.
సంఖ్యాపరంగా కమిటీలో చోటు
పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో వారికి చోటు దక్కుతుంది. అంటే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నుంచి ఒక ఎంపీ కమిటీ ఛైర్మన్ గా ఉంటారు. తొలుత ఈ ప్రతిపాదిత కమిటీకి 90 రోజుల సమయం కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత దాన్ని పొడిగించొచ్చు.