Only One Student Sanskrit Exam In School : ఒకే ఒక్క విద్యార్థిని- ఎనిమిది సిబ్బంది విధులు- అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలోని ఇదే జరిగింది. ఓ పరీక్షా కేంద్రంలో సంస్కృతం ఎగ్జామ్ ఒకే ఒక్క విద్యార్థిని హాజరుకాగా, ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే అశోక్ నగర్ జిల్లాలో కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 858 మంది అభ్యర్థులు హాజరు అవుతుండగా, అందులో 466 మంది హయ్యర్ సెకండరీ పరీక్షలు రాస్తున్నారు. అయితే 12వ తరగతి సంస్కృతం పరీక్ష బుధవారం జరిగింది. సరస్వతి శిశు మందిర్‌కు మనీషా అహిర్వార్ అనే ఒక్క విద్యార్థిని మాత్రమే హాజరైంది.
ఒక్క విద్యార్థిని- ఎనిమిది సిబ్బంది విధులు!
అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనీష చదువుతోంది. సరస్వతి శిశు మందిర్ ఎగ్జామ్ సెంటర్‌కు గాను కలెక్టర్ ప్రతినిధి ఆకాశ్‌జైన్‌తో పాటు సూపర్‌వైజర్ సప్నా శర్మ, సెంటర్ హెడ్ అస్లాం బేగ్ మీర్జా, అసిస్టెంట్ సెంటర్ హెడ్ నిర్మలా చండేలియా, రాజ్‌కుమార్ ధురంతే, ఒక పోలీసు, ఇద్దరు ప్యూన్‌లను జిల్లా అధికారులు నియమించారు. దీంతో బుధవారం ఒక్క మనీషానే పరీక్ష రాయడం వల్ల ఒక్క విద్యార్థిని- 8 మంది సిబ్బందిలా మారింది పరిస్థితి.
నాలుగు కేంద్రంల్లో ఐదుగురు కన్నా తక్కువే
అయితే అశోక్‌నగర్ జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో సంస్కృతం ఎగ్జామ్‌కు ఐదుగురు కన్నా తక్కువ విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. సరస్వతీ శిశుమందిర్‌లో ఒకరు, ముంగావలి ప్రభుత్వ పాఠశాలలో ఒకరు, పిప్రాయిలో ముగ్గురు, నవీన్ ఉమా స్కూల్లో నలుగురు విద్యార్థులు సంస్కృతం పరీక్ష రాశారు. చాలా మంది విద్యార్థులు సంస్కృతం సబ్జెక్ట్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదని టీచర్ సరళ తోమర్ తెలిపారు.
ఇప్పుడిప్పుడే కొందరు విద్యార్థులు సంస్కృతం సబ్జెక్ట్‌ను ఎంచుకుంటున్నట్లు చెప్పారు సరళ. ప్రస్తుతం కచార్ ప్రభుత్వ పాఠశాలలో ఆమె సంస్కృతం ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వరిస్తున్నారు. తమ పాఠశాలలో 12వ తరగతిలో నలుగురు విద్యార్థులు సంస్కృతం సబ్జెక్ట్‌ను తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు 11వ తరగతిలో 13 మంది తీసుకున్నారని తెలిపారు.