Omar Abdullah Meets Jk LG : జమ్మూకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ కూటమి కూటమి సిద్ధమైంది. ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సెన్హాను కలిశారు. తమ కూటమికి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు గురించి తెలుపుతూ ఎల్జీకి ఓ లేఖ సమర్పించారు. ఈ నెల 16న అంటే బుధవారం రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్కు తెలియజేసినట్లు ఒమర్ అబ్దుల్లా మీడియాకు తెలిపారు.
Jammu and Kashmir National Conference Vice President Omar Abdullah met LG Manoj Sinha in Srinagar and staked claim to form the government
— ANI (@ANI) October 11, 2024
(Source: Raj Bhavan) pic.twitter.com/Nt3KkZltxo
పదేళ్ల తరువాత
జమ్మూకశ్మీర్లో పదేళ్ల తరువాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘనవిజయం సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయకుండానే ఎన్నికల ప్రచారం సాగించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తేలిన నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఒమర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. బద్గాం నియోజకవర్గం నుంచి పీడీపీ అభ్యర్థి అగా సయద్ ముంతజీర్ మెహ్దీపై 18వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట అయిన గందర్బల్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా అక్కడ కూడా గెలిచారు.
జమ్ముకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. ఎలా అంటే, జమ్ముకశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫిరెన్స్ ఏకంగా 42 సీట్లు గెలుచుకుంది. ఎన్సీ మిత్రపక్షమైన కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీనితో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 46ను సంపాదించగలిగాయి. బీజేపీ మొత్తం 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇక పీడీపీ 3 సీట్లు మాత్రమే సాధించగలిగింది. జేపీసీ 1, సీపీఎం 1, ఆప్ 1, ఇతరులు 7 సీట్లలో విజయం సాధించారు. మొత్తంగా చూసుకుంటే, కశ్మీర్ ప్రాంతంలో ఎన్సీ, జమ్మూలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి.