Sitaram Yechury On Lok Sabha Election : లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం)కు స్వల్పంగా సీట్లు పెరిగినా, తమ పనితీరుపై సంతృప్తిగా లేమంటోంది ఆ పార్టీ. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసేందుకు ఉన్న అంతరాన్ని ఎలా పూడ్చుకోవాలో తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తమకు మరిన్ని సీట్లు గెలుచుకునే సత్తా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వామపక్ష సంస్థలు అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించినప్పటికీ, దాని ప్రభావం ఎన్నికల్లో కనిపించకపోవడం నిరాశపరిచిందని అన్నారు. రైతులు, యువతకు ఉపాధి, విద్యావ్యవస్థలో సమస్యలు, నీట్ పరీక్షలపై చేపట్టిన ఆందోళనల మాదిరిగానే ప్రజల జీవనోపాధిపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
మరోవైపు సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలోని త్రిసూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపీ గెలుపుపైనా స్పందించారు ఏచూరి. యూడీఎఫ్ ఓట్లు ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లు చీలి బీజేపీకి మళ్లాయని చెప్పారు. కాంగ్రెస్ కంచుకోట బీజేపీ వైపు కదులుతుండటం, కేరళకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే విషయమన్నారు. మతాన్ని ప్రచార అస్త్రంగా ఎంచుకోవడం వల్ల బీజేపీ విఫలమైందన్నారు సీతారాం ఏచూరి. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ సిట్టింగ్ సీటును ఓడిపోవడమే ఇందుకు అతిపెద్ద ఉదాహరణగా చెప్పారు. అంతేకాదు కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించినా, అక్కడా ఓడిపోయారని విమర్శించారు. బీజేపీ మన సమాజం, ప్రజలు, దేశంపై విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు.
కాగా 17వ లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలకు 5 సీట్లు రాగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్యను 8కి పెంచుకుంది. సీపీఐ(ఎం) నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( మార్కిస్ట్ -లెనినిస్ట్ ) లిబరేషన్ రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. 2019లో సీపీఐ(ఎం)కు 1.75 శాతం ఓట్లు రాగా, సీపీఐకి అర శాతం కంటే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసీఐ వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం ఈసారి సీపీఐ(ఎం) ఓట్ల శాతం దాదాపు 1.76 శాతం కాగా, సీపీఐకి 0.50 శాతం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌కు 0.27 శాతం ఓట్లు వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీకి 16.68 శాతం ఓట్లు రాగా, 2019లో 12.9 శాతం ఓట్లు వచ్చాయి. కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, సీపీఐ(ఎం) ఒక్కో సీటును గెలుచుకోగా, యూడీఎఫ్ 18 స్థానాల్లో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచింది.