NET Exam 2024 Cancelled : జాతీయ పరీక్ష సంస్థ NTA దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దు నిర్ణయాన్ని తామే స్వతంత్రంగా తీసుకున్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షకు వ్యతిరేకంగా తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని, కేవలం విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షను రద్దు చేశామని కేంద్రం తెలిపింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇంతకంటే ఇంకేం చెప్పలేం!
NET పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జయస్వాల్ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేమని అన్నారు. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. కేవలం దర్యాప్తు సంస్థల నుంచి తమకు వచ్చిన ఆధారాల కారణంగానే పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
విమర్శలు గుప్పించిన కాంగ్రెస్!
నీట్లో అక్రమాలు, యూజీసీ నెట్ పరీక్ష రద్దు వంటి వరుస ఘటనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. లీకేజీలు, మోసాలు లేకుండా మోదీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రతి ఏడాది పరీక్షా పే చర్చ పేరుతో తమాషాలు చేసే మోదీ, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రోజుకో ప్రశ్నపత్రం లీక్ అవుతోందని, ఇది ఎలాంటి పరీక్ష పే చర్చ అని ఖర్గే నిలదీశారు.
దేశ విద్య, నియామక వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఎలా నాశనం చేసిందో, నీట్ యూజీసీ, నెట్, సీయూఈటీ పరీక్షల నిర్వహణ చూస్తే అర్థమైపోతుందని ఖర్గే మండిపడ్డారు. 2020 ఆగస్టులో మోదీ NRAను ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని, ఇప్పుడు ఆ సంస్థ నిర్వీర్యం అయిపోయందని విమర్శించారు. దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయకుండా యువత రిజర్వేషన్ హక్కును లాక్కోవడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఖర్గే ఆరోపించారు.
NCERT పుస్తకాల్లో శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించే బదులు దానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఖర్గే ఆరోపించారు. యూజీసీ, సీబీఎస్‌ఈ, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల స్వయంప్రతిపత్తిని రద్దు చేశారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లలో ప్రధాని మోదీ 'పరీక్ష పే చర్చ'పై ఖర్చు 175 శాతం పెరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించలేని వ్యక్తి, పరీక్షల సమయంలో విద్యార్థులపై జ్ఞాన వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలి: రాహుల్
నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. "లీకేజీపై విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వారి భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లుగా ఉంది. దేశంలో స్వతంత్ర విద్యావ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదు" అని రాహుల్ అన్నారు.