Nitin Gadkari On Present Politics : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య తగ్గిపోతోందన్నారు. వాటిని పట్టించుకోకుండా ఆ రోజున అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్లాలనుకుంటున్న రాజకీయ నాయకుల ధోరణిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు. అలాగే మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిందన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"చర్చల్లో అభిప్రాయ భేదాలు ఉండటం ఇబ్బంది కాదు. కానీ తగిన ఆలోచన లేకపోవడమే అసలు సమస్య. కొందరు తమ సిద్ధాంతాల వల్ల దృఢ నిశ్చయంతో ఉంటారు. అలా విలువలకు కట్టుబడే వారి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోతోంది. భావజాలంలో క్షీణత కనిపిస్తోంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నాయకులు అప్పటికి అధికారంలో ఉన్న పార్టీతో అనుబంధం కొనసాగించాలని అనకుంటారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రత్యేకత వల్లే మన పాలనా వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పాపులారిటీ, పబ్లిసిటీ అవసరమే కానీ, నేతలు తమ నియోజకవర్గాల్లో చేసిన పనే వారికి వన్నె తెస్తుంది."
--నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
ఈ క్రమంలోనే తనపై ప్రభావం చూపిన వ్యక్తుల గురించి కూడా నితిన్ గడ్కరీ వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ తర్వాత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తీరు తనను ఆకట్టుకుందని గడ్కరీ తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ప్రశంసించారు. ఇటీవల భారతరత్న పురస్కరాన్ని పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. రానున్న రోజుల్లో మన ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం అవుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Nitin Gadkari Biopic : వెండితెరపై గడ్కరీ జీవితం.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ విషయంలో సస్పెన్స్
'నన్ను ఆ పదవి నుంచి తప్పించడంపై బాధలేదు.. భాజపా కార్యకర్తగా గర్విస్తున్నా'