NIA Raids Today : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో ఏడు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
2023 జులైలో ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్ భావజాలంతో ప్రభావితమైనవారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. నజీర్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది.
కొద్ది రోజుల క్రితం బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన జరిగింది. ఆ కేసును కూడా సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆ తర్వాతి రోజే 2023 నాటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించిన తనిఖీలు జరగడం గమనార్హం.
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ
ISIS Terror Activities in India : భారత్‌లో భారీ బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను కొన్నాళ్ల క్రితం జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భగ్నం చేసింది. 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన NIA ఉగ్ర ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరకు, ఉగ్ర కుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబయి, ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్, బొకారో సహా దిల్లీలో NIA తనిఖీలు నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ పోలీసుల సహకారంతో NIA ఈ సోదాలు జరిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
విపక్షాలపై రాజ్యసభ ఎన్నికల ఎఫెక్ట్!- హిమాచల్, యూపీలో పరిస్థితులు మారేనా?
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు క్యాన్సర్ - 'సరిగ్గా ఆదిత్య ప్రయోగం రోజే తెలిసింది'