Theatre Canteen Owner Bites Pushpa 2 Viewer Ear : ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ సొంతం చేసుకుంది. తాజాగా రూ.1000 కోట్లు వసూళ్లు సాధించింది. అయితే, ఈ సినిమా- ఓ థియేటర్ క్యాంటీన్ యజమాని, ప్రేక్షకుడి మధ్య చిచ్చు పెట్టింది!. చివరకు ఆ ఘర్షణ థియేటర్ యజమాని- ప్రేక్షకుడి చెవి కొరికే వరకు వెళ్లింది. అసలు వారిద్దరి మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తిందంటే?
ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షబ్బీర్ అనే వ్యక్తి పుష్ప-2 సినిమా చూసేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఇంద్రగంజ్ ప్రాంతంలో ఉన్న కైలాశ్ టాకీస్‌కి వెళ్లాడు. సినిమా ఇంటర్వెల్ బ్రేక్‌లో తినుబండారాలు కొనేందుకు థియేటర్లోనే ఉన్న క్యాంటీన్‌కు వెళ్లాడు. అయితే ఈ క్రమంలో తినుబండారాల బిల్లు విషయంలో షబ్బీర్, క్యాంటీన్ యజమాని రాజు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాజు తన సహచరులతో కలిసి షబ్బీర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో క్యాంటీన్ ఓనర్ రాజు- షబ్బీర్ చెవిని కొరికేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై సోమవారం షబ్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు, మెడికల్ రిపోర్టు ఆధారంగా మంగళవారం ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ నిరంజన్ శర్మ తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు డైరెక్షన్లో 2021లో పుష్ప- ది రైజ్ విడుదల అయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు. పుష్ప-2 ది రూల్ డిసెంబర్ 5న తెలుగు సహా హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలీ, మలయాళంలో విడుదల అయింది. బాక్సాఫీస్ ముందు మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా కేవలం 6 రోజుల్లో రూ.1000 వసూళ్లు సాధించింది. దీంతో ఇంత తక్కువ సమయంలో ఈ మైలురాయి అందుకున్న తొలి భారత సినిమాగా చరిత్ర సృష్టించింది.