MP Recruitment Exam : స్కూల్, కాలేజీ, ఉద్యోగం కోసం రాసే పరీక్ష ఇలా ఎందులోనైనా 100కు 100 మార్కులు వచ్చాయంటే నమ్ముతాం. అదే 100కు 101.66 మార్కులు వచ్చాయంటే నమ్ముతారా? అవునండీ మధ్యప్రదేశ్ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఓ అభ్యర్థికి అన్ని మార్కులే వచ్చాయి. దీంతో పరీక్షలో అతడే టాపర్‌గా నిలిచాడు. అయితే 100కి అంతకుమించి మార్కులు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకతవకలు, అక్రమాలు జరుగుతాయన్న నిరుద్యోగుల వాదనలకు ఈ ఉదంతంతో మరింత బలం చేకూరుతోంది.
అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దానిపై న్యాయపరమైన విచారణ జరిపించాలని ఉద్యోగ అశావాహులు నిరసనకు దిగారు. ఉద్యోగ నియామక పరీక్షలో నార్మలైజేషన్ విధానం ద్వారా ఓ అభ్యర్థికి 100కి 101.66 మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇందౌర్‌లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అలాగే ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట నిరసనలు
ఇందౌర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌కు ఇవ్వాలని ఓ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫారెస్ట్ గార్డు, ఫీల్డ్ గార్డు (ఎగ్జిక్యూటివ్), జైలు గార్డు (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి జరిగిన రిక్రూట్ మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దానిపై న్యాయమైన విచారణ జరిపించాలని కోరారు.
ఇటీవలే ఫలితాలు రిలీజ్
అటవీ, జైళ్ల శాఖ ఉమ్మడి రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023 (వాన్ అండ్ జైల్ రిక్రూట్ మెంట్ టెస్ట్ 2023)లో ఒక అభ్యర్థి 100కు 101.66 మార్కులు సాధించాడు. ఈ క్రమంలో పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ఎంప్లాయీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 13న ప్రకటించింది. ఫలితాల ప్రకటన తర్వాత నిబంధనల ప్రకారం మార్కుల నార్మలైజేషన్ విధానం చేపట్టామని బోర్డు తెలిపింది. దీని కారణంగా అభ్యర్థులు 100కు 100 మార్కులు, అంతకంటే కంటే ఎక్కువ, లేదా తక్కువ మార్కులు పొందవచ్చని పేర్కొంది. ఈ ప్రకటనతో ఆందోళనకారులు నిరసనకు దిగారు.
'రాష్ట్ర చరిత్రలో తొలిసారి'
"రిక్రూట్‌మెంట్ పరీక్షలో నార్మలైజేన్ విధానం ద్వారా ఒక అభ్యర్థి మొత్తం మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అన్యాయమైన ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాము" అని నిరసనకారులకు నేతృత్వం వహిస్తున్న గోపాల్ ప్రజాపత్ తెలిపారు.
నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏమిటి?
ప్రస్తుత కాలంలో చాలా వరకు ప్రభుత్వ పరీక్షలు విడతలవారీగా జరుగుతున్నాయి. అనేక సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలో మార్కుల నార్మలైజేషన్ అనేది ఉద్యోగార్థులు రాసే పరీక్ష పేపర్ ఈజీ, టఫ్‌నెస్ ఆధారంగా నిర్ణయిస్తారు. అన్ని పేపర్లను పరిశీలించి నార్మలైజేషన్ చేపడతారు.
IIT అడ్మిషన్ న్యూ రూల్స్ - ఇకపై SC, STలకు అడ్మిషన్ ఫీజులో రాయితీ - కటాఫ్ మార్కుల్లో రిలాక్సేషన్
ఎగ్జామ్ హాల్స్‌లో ఇక AI సీసీ కెమెరాలతో నిఘా- నెట్, నీట్ వివాదాలతో UPSC అలర్ట్ - AI BASED CCTV UPSC