Moi Virundhu For Landslide Victims : కేరళలో ఇటీవల జరిగిన ఘోర విషాదం అందరికీ తెలిసే ఉంటుంది. వయనాడ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో నిరాశ్రయులైన, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి తమిళనాడు దిండిగల్‌లోని ఒక రెస్టారెంట్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మోయి విరుంధు(Moi Virundhu) అనే ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. స్థానిక రెస్టారెంట్ యజమాని ముజీబ్ 2024 ఆగస్టు 7న సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ తమిళ పద్ధతిలో అతడు ఫండ్స్ సేకరించేందుకు ఈ విందు ఏర్పాటు చేశారు.
ఒక లక్ష్యం కోసం విందు
ముజీబ్ కేవలం తాను డబ్బు విరాళంగా ఇస్తే సరిపోదని, ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని భావించాడు. ప్రత్యేక విందు డెజర్ట్‌తో ప్రారంభమైంది. చికెన్ బిర్యానీ, చికెన్ 65, పరోటా, ఘీ రైస్, ఆనియన్ రైతా, పాయసం వంటివి కూడా వడ్డించారు. అతిథులు భోజనాన్ని ఆస్వాదించారు. తమిళ పాత సంప్రదాయం లానే ఆకుల కింద తాము ఇవ్వాలనుకున్న డబ్బు పెట్టి వెళ్లారు.
మొయి విరుంధు సంప్రదాయం
మొయి విరుంధు అనే పద్ధతికి తమిళ సంస్కృతిలో ప్రత్యేక స్థానముంది. సంప్రదాయకంగా, అవసరాల్లో ఉన్నవారి కోసం డబ్బును సేకరించడానికి నిర్వహించే విందు. ప్రజలు ఒకచోట చేరి, భోజనాన్ని ఆస్వాదిస్తారు. వారు ఇవ్వగలిగినంత, తిన్న ఆకు కింద పెట్టి వెళ్తారు. అత్యవసరాల్లో అప్పులు చేయకుండా, ఒకరికొకరు సాయం చేసుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
ముజీబ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా అనేక మంది వ్యక్తులు ఈ కార్యక్రమానికి సహకరించారు. దీంతో విందుకు భారీగా ప్రజలు హాజరయ్యారు. తమకు తోచినంత విరాళం ఇచ్చారు. రిలీఫ్ ఫండ్ కోసం ఏర్పాటు చేసిన పిగ్గీ బ్యాంకులో కూడా కొందరు కాయిన్స్ వేశారు. ఒక వ్యక్తి రూ.10,000 రూపాయల చెక్కును అందించారు. "అష్టకష్టాలు పడుతున్న ప్రజల కోసం ఈ మొయి విరుంధు ఏర్పాటు చేశాం. మనకు వీలుపడినంత ఫండ్స్ ఇచ్చాం. ఇప్పుడు కడుపు, గుండె నిండుగా ఉంది" అని విందులో పాల్గొన్న రాజేశ్వరి అనే మహిళ తెలిపింది.
వయనాడ్‌కు మద్దతు
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ఫండ్స్‌ను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేయనున్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల దాదాపు 400 మందికి పైగా మరణించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముజీబ్ తరహాలో ఫండ్స్ సేకరించేందుకు చాలా మంది వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషాద సమయంలో భారతదేశమంతా వయనాడ్‌కు అండగా నిలుస్తోంది.