Modi On Congress : కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే బాలరాముడిని మళ్లీ టెంట్‌లోకి పంపుతారని, అయోధ్య నూతన ఆలయంపైకి బుల్డోజర్లు పంపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుల్డోజర్ ఎక్కడ నడిపించాలి, ఎక్కడ నడిపించకూడదో యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ, ఈ వ్యాఖ్యలు చేశారు.
'దేశానికే కాదు ప్రపంచానికి తెలుసు'
కొత్త ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, యువత కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోనుందని మోదీ చెప్పారు. అందుకోసం ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టనుందని మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి తెలుసు అని అన్నారు. ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తుంటే, మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని మోదీ విమర్శించారు. ఈ ఎన్నికల తర్వాత వారి కూటమి పేకమేడలా కూలిపోతుందని విమర్శించారు.
"శ్రీరామనవమి రోజున రామమందిరంపై ఎస్పీకి చెందిన ఓ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. దేశంలో స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్నప్పుడు దేశవిభజన మాట వినిపించేది. ప్రతి ఒక్కరు దేశ విభజన జరిగే పని కాదనేవారు. కానీ అయిందా లేదా? వారు (కాంగ్రెస్ నేతలు) చేశారా? లేదా? వారు (కాంగ్రెస్ నేతలు) ఎంతవరకైనా వెళ్తారు. వారి ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
ఆ భయంతోనే!
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. అమేఠీలో ఆయన పోటీ చేసే సాహసం చేయరని తాను ముందే ఊహించానని, ఇప్పుడు అదే నిజమైందని ఎద్దేవా చేశారు. మరోవైపు, తాను మూడోసారి ప్రధాని అయ్యాక జవహర్‌లాల్ నెహ్రూ స్థాయికి ఎదుగుతాననే భయంతో ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు మోదీ. దాంతోపాటు దేశంలో సంపద సృష్టికర్తలను గౌరవించాలని కోరారు.
"కార్మికులు మాదిరిగానే సంపద సృష్టికర్తలను దేశంలో గౌరవించాలని నేను ఎర్రకోట నుంచి చెబుతూనే ఉన్నాను. విజయం సాధించిన వారు ప్రసిద్ధి చెందాలి. భారతీయ కంపెనీలు విదేశాల్లో ఎందుకు అభివృద్ధి చెందకూడదు? ఎవరైనా దేశానికి ద్రోహం చేసి ఉంటే ఉరితీయాలి. అన్యాయంగా వ్యవహరిస్తే ఉరితీయాలి. కానీ సంపద సృష్టికర్తలను గౌరవించాలి. అందుకే నేను కూడా గౌరవిస్తాను" అని మోదీ తెలిపారు.
'జూన్ 4 తరువాత కూటమి విచ్ఛిన్నం ఖాయం' - మోదీ - PM Modi Slams Opposition
2029 వరకు మోదీయే ప్రధాని- ఆ తర్వాత కూడా ఆయనే!: అమిత్ షా - Lok Sabha Elections 2024