Modi And Rishi Sunak Discussion About FTA : భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. భారత్-యూకేల 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ 'ఫ్రీ ట్రైడ్ అగ్రిమెంట్' (FTA)ను వీలైనంత త్వరగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు.
"బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మంచి సంభాషణ జరిగింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాని నిర్ణయించుకున్నాం. అలాగే పరస్పర ప్రయోజనకరమైన 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని' వీలైనంత త్వరగా ముగించడానికి కృషి చేస్తామని పునరుద్ఘాటించాం."
- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
భారత్-బ్రిటన్ మైత్రి
రానున్న రోజుల్లో భారత్, బ్రిటన్ మధ్య మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, సునాక్ నిశ్చయించుకున్నారు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య 36 బిలియన్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. దాన్ని మరింత విస్తరించేందుకు ఎఫ్‌టీఏ ఒప్పందం చాలా కీలకం కానుంది. దీన్ని ఖరారు చేసుకునే దిశగా ప్రస్తుతం 14వ విడత చర్చలు కొనసాగుతున్నాయి. అందుకే మున్ముందు ఈ విషయంలో పురోగతిని సమీక్షించేందుకు సంప్రదింపులు కొనసాగించాలని మోదీ, సునాక్ నిర్ణయించారు.
మరోవైపు 'రోడ్‌మ్యాప్ 300' కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అత్యాధునిక సాంకేతికతలు సహా వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతిపై మోదీ, సునాక్ ఇరువురూ సంతృప్తి వ్యక్తం చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. రానున్న హోలీ పండుగను పురస్కరించుకుని ఒకరికొకరు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
100 బిలియన్ డాలర్లు!
భారత్-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (EFTA) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇటీలలే కుదిరింది. దీనిలో భాగంగా ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫలితంగా స్విట్జర్లాండ్ వాచీలు, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల లాంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, లిక్టన్‌స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ఒక సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా లాంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది. అయితే ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి బహుశా ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.
'CAAను చూసి భారతీయ ముస్లింలు భయపడొద్దు- హిందువులతో సమానంగా వారికి హక్కులు'
గుడ్ న్యూస్ - ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు - కొత్త డేట్ ఇదే!