MLA Poaching Kejriwal : తనను జైలుకు పంపినా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఆగవని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పాఠశాలల నిర్మాణం, ప్రజలకు ఉచిత వైద్యం అందించడం వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ నిలిచిపోవని చెప్పారు. తాము బీజేపీలో చేరాలని ఆ పార్టీ కోరుకుంటోందని, కానీ తాము తలవంచమని కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు.
ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆప్ నేతలపైకి ఉసిగొల్పారని కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీలోని కిరారీలో రెండు పాఠశాలల భవనాలకు శంఖుస్థాపన చేసిన కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలు కట్టినందుకే మనీశ్ సిసోదియాను జైలులో పెట్టారని, మొహల్లా క్లినిక్‌లు కట్టినందుకే సత్యేందర్ జైన్‌ను కారాగారానికి పంపించారని విమర్శించారు.
దిల్లీ మంత్రి ఆతిశీకి నోటీసులు
ఆప్ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్న ఆరోపణల కేసులో నోటీసులు అందించేందుకు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం మంత్రి ఆతిశీ ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నోటీసులు అందజేయడానికి మరోసారి వస్తామని చెప్పారు. కానీ తమ కార్యాలయ సిబ్బందికి ఆ నోటీసులు అందించాలని ఆతిశీ కోరినా, పోలీసులు నిరాకరించినట్లు సమాచారం.
ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం నోటీసు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన ఆప్ శాసనసభ్యుల పేర్లను వెల్లడించాల్సిందిగా కోరారు.
'నిజాయితీ ఉంటే పారిపోరు'
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారు దేని నుంచి పారిపోరని అన్నారు. అటువంటి వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారని, పోరాడతారని చెప్పారు.
ఇదీ కేసు!
ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని జనవరి 27న ఆతిశీ, కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్లు చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు చూపించాలని కేజ్రీవాల్‌ను సవాల్ చేసింది.
రాజకీయ కారణాలతో దేశ సంస్కృతినే అవమానించారు!: మోదీ
భారత్-రష్యా సీక్రెట్లు పాక్‌కు! మాస్కోలోని ఎంబసీలో ISI ఏజెంట్!- మేరఠ్‌లో అరెస్ట్