Pooja Khedkar IAS Controversy : మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ IAS పూజా ఖేడ్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు సహా భవిష్యత్తులో పరీక్షలు, సెలక్షన్స్ నుంచి ఆమెను ఎందుకు డిబార్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి రాయడంపై పూజా ఖేడ్కర్‌పై UPSC ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పుణెలో శిక్షణలో ఉండగా పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజాపై వచ్చిన ఆరోపణలు అన్నింటిపై UPSC దర్యాప్తు చేసింది. పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు దర్యాప్తులో తేలింది.
ఇప్పటికే ప్రొబేషన్ రద్దు
UPSCపై ప్రజల్లో ముఖ్యంగా అభ్యర్థులకు బలమైన విశ్వాసం ఉందని, అలాంటి విశ్వసనీయతను కాపాడేందుకు కమిషన్ రాజీపడకుండా పని చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు పరీక్ష విధానాలు, నియమాలకు UPSC కట్టుబడి ఉంటుందని గుర్తు చేసింది. షోకాజ్ నోటీసుపై పూజా ఖేడ్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేసి, ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని కూడా ఆదేశించారు.
UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek
— ANI (@ANI) July 19, 2024
సర్టిఫికెట్లపైనా అనుమానాలే!
2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ సమయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్‌నెట్ సర్టిఫికెట్ సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె నాన్ క్రిమీలేయర్, వైద్య ధ్రువీకరణలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తును చేపట్టింది.