Mayawati Akash Anand : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్‌పై వేటు వేశారు. యువనేతకు పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. కేవలం ఐదు నెలల్లోనే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తన సోదరుడు (ఆకాశ్ తండ్రి) ఆనంద్ కుమార్ ఇంతకుముందు మాదిరిగా పార్టీ జాతీయ సమన్వయ కర్త బాధ్యతలు నిర్వర్తిస్తారని మాయావతి చెప్పారు.
"బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు. ఆత్మగౌరవం, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపు. కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దానికోసమే అంకితం చేశాం. కొత్తతరాన్ని కూడా అందుకు సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా, ఉత్తరాధికారిగా ప్రకటించాం. అయితే పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పూర్తి పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నాం. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్ కుమార్ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు" అని మాయావతి పోస్ట్ చేశారు.
ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్, యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు. యువతను ఆకలితో ఉంచుతూ పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. అదే సమయంలో ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలీలన్నింటినీ బీఎస్పీ రద్దు చేసింది. ఇప్పుడు మాయవతి వేటు వేశారు.
'బీజేపీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయమా?'
అయితే మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ సమన్వయ కర్త పదవి నుంచి తప్పించిన తీరు షాకింగ్‌గా ఉందని కాంగ్రెస్ తెలిపింది. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా అని మాయావతిని కాంగ్రెస్ నేత సురేంద్ర సింగ్ రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం బీఎస్పీ అంతర్గత విషయమే అయినప్పటికీ దీనిపై మాయావతి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'మాయవతి నిర్ణయం అందుకే!'
మరోవైపు, బీఎస్పీని మాయవతి ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనేజేషన్లాగా నడుపుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఆమె ఎప్పుడైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని చెప్పింది. "భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆకాశ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజలకు కోపం వచ్చింది. వ్యతిరేకత కూడా మొదలైంది. అందుకే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశ్‌ను బాధ్యతల నుంచి తొలగించారు" అని బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఆరోపించారు.
-
VIDEO | "The way BSP chief Mayawati has removed her nephew Akash Anand from party coordinator post is very shocking. Did you take this step under some pressure from the BJP? Though this is an internal matter of your party, you should issue a clarification about this," says… pic.twitter.com/E7Rhp7LLqd
— Press Trust of India (@PTI_News) May 7, 2024
మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ ఆనంద్ 2016లో బీఎస్పీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఇటీవల డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలో కూడా ఆకాశ్ కీలకంగా వ్యవహరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ పేరును మాయావతి ప్రకటించారు. ఇదంతా పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మాయావతి తర్వాత అధ్యక్ష పదవి ఎవరు చేపడతారన్న చర్చకు తెరదించినట్లైందని తెలిపారు. కానీ ఇంతలో ఆకాశ్‌పై వేటు వేశారు బీఎస్పీ అధినేత్రి.
యూపీలో కాంగ్రెస్‌కు కొత్త ఆశలు! BSP ఒంటరి పోరు వరమయ్యేనా? BJP దారెటు?
'సార్వత్రిక సమరంలో ఒంటరి పోరు- ఎన్నికల తర్వాత పొత్తు'- రిటైర్మెంట్పై మాయావతి క్లారిటీ