Massive violence in Balodabazar : ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లో ఓ వర్గం చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది నిరసనకారులు కలెక్టరేట్లో ఆవరణలోకి చొరబడి అక్కడ పార్క్ చేసిన 200 వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 35 -40 పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ధ్వంసం చేశారు.
అసలేం జరిగిందంటే?
గత నెలలో గిరోద్‌పురి ప్రాంతంలోని ఒక వర్గానికి చెందిన మతపరమైన స్థలాన్నిగుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విచారణ సరిగా జరగడం లేదంటూ ఆ వర్గానికి చెందిన వేలాది మంది ప్రజలు దసరా మైదానంలో చాలా రోజులుగా నిరసనలు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్, జిల్లా పంచాయతీ కార్యాలయాలను ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోకి వస్తున్న అందోళకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులుకు, నిరసకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
మరోవైపు కొంతమంది నిరసనకారులు కలెక్టరేట్ ఆవరణలోనికి చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. 70 ద్విచక్ర వాహనాలతో సహా 200 పైగా వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనతో బలోదాబజార్‌లో జూన్ 11 వరకు 144 సెక్షన్ విధించారు.
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులతో కలిసి సోమవారం అర్థరాత్రి ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ దాడిలో చాలా వరకు ప్రభుత్వ కార్యలయంలో పని చేసే పేద వారి వాహనాలు కాలిపోయాయని ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అన్నారు. ఇది చాలా బాధకరమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన్నట్లు తెలిపారు.
చెలరేగిన హింస- పలువురు పోలీసులకు గాయాలు
'ఓ వర్గానికి చెందిన ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేపడతామని రాతపూర్వక హామీ ఇచ్చారు. కానీ వారి నిరసన అదుపు తప్పి హింసకు దారితీసింది. పోలీసు భారీ బందోబస్తు, బారికేడ్లను బద్దలు కొట్టారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వాహనాలకు నిప్పంటించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. హింసకు పాల్పడినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం.' అని పోలీసు అధికారి సదానంద్ కుమార్ తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు
హింసాత్మక ఘటనపై అప్రమత్తమైన అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద భద్రతను మరింత పెంచారు. కలెక్టరేట్ సమీపంలో ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచారు.
అయితే గత నెలలో జరిగిన ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. దీనిపై కొద్ది రోజుల క్రితమే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి స్పందించారు. బలోద్బజార్లో శాంతి, సామరస్యం కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బలోదాబజార్ జిల్లాలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
కొలువుదీరిన కొత్త మంత్రులు- మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ఛార్జ్
'మోదీ ప్రమాణస్వీకారం వేడుకలో వింత జంతువు పులి కాదు'- దిల్లీ పోలీసులు క్లారిటీ