Married Couples Face Problems In Absence Of Intimacy : అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఎన్ని బంధాలు, బంధుత్వాలు ఉన్నప్పటికీ పాలునీళ్లలా కలిసి ఉండాల్సిన పవిత్ర బంధం ఇది. అయితే.. ఈ బంధంలోనూ చిన్న చిన్న విభేదాలు రావడం కామన్. అవన్నీ.. టీ కప్పులో తుఫాను మాదిరిగా సద్దుమణిగి పోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని.. ఒకరికొకరు సర్దిచెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలా కాకుండా.. ఇద్దరి మధ్యా నిత్యం గొడవలు జరుగుతున్నాయంటే.. వారి మధ్య సాన్నిహిత్యం(Intimacy) లోపించడమే కారణమంటున్నారు నిపుణులు.
కోపగించుకోవడం : భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం లేకపోతే.. అది మానసిక విడాకులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దంపతులిద్దరూ భావోద్వేగాలను అర్థం చేసుకోనప్పుడు.. వారి మధ్య అనవసరమైన వాదనలు, వివాదాలు వస్తాయి. ఫలితంగా భాగస్వాములిద్దరూ సమస్యకు పరిష్కార మార్గం వెతకడం వదిలేసి.. ఒకరినొకరు నిందించుకోవడం మొదలు పెడతారు. కాబట్టి.. ఏ రిలేషన్‌లోనైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయని గుర్తించాలి. వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ప్రతిదానికీ ఎదుటివారిపై కోపం పెంచుకుంటే.. క్రమంగా దూరాన్ని పెంచుకున్నట్టే!
ఒత్తిడి పెరుగుతుంది : దంపతుల మధ్య ఇంటిమెసి లేకపోతే ఆ కారణంగా తలెత్తే మరో సమస్య ఒత్తిడి పెరగడం. దాంతో.. భార్యాభర్తల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే అది శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి పార్ట్నర్స్ మధ్య ఒత్తిడి పెరగకుండా, బంధం బలంగా ఉండాలంటే సాన్నిహిత్యం లోపించకుండా చూసుకోవడం మంచిది.
పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ను - ఎలా సెలక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా?
ఆత్మవిశ్వాసం దెబ్బతినడం : భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం లోపిస్తే.. అది దంపతుల ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. కాబట్టి.. ఒకరినొకరు గౌరవించుకోండి. ఒకరినొకరు ప్రేమించండి. భాగస్వామి మంచి చేసినప్పుడు మెచ్చుకోండి. పొరపాటు చేస్తే.. ఇలా కాకుండా అలా చేస్తే బాగుండేది అని స్మూత్‌గా చెప్పండి. ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.
నిద్రలేమి : సాధారణంగా.. సంతృప్తికరమైన లైంగిక సంబంధాన్ని ఆస్వాదించే జంటలు ప్రశాంతమైన నిద్రను అనుభవిస్తాయి. అదే.. దాంపత్య సుఖం లోపిస్తే మాత్రం.. నిద్రలేమి సమస్యకు దారి తీయవచ్చని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియా వినియోగం : భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం లేకపోతే.. మరో తీవ్రమైన సమస్య మీ మధ్యలోకి వచ్చేస్తుంది. అదే సోషల్ మీడియా. దీన్ని అందరూ మామూలుగా వినియోగిస్తే.. భాగస్వామితో వివాదాలు ఉన్నవారు బాధతో, ఒంటరితనంతో మరింత ఎక్కువగా వాడుతారు. దీంతో.. కచ్చితంగా మూడో వ్యక్తి మధ్యలోకి ఎంటరయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇది అత్యంత తీవ్రమైన దశ.
వివాహేతర సంబంధం : దంపతుల మధ్య సాన్నిహిత్యం, ప్రేమ లేకపోతే.. ఆఖరిగా జరిగే విధ్వంసం వివాహేతర సంబంధం రూపంలో ఉంటుంది. పైన చెప్పుకున్న దశలన్నీ దాటడానికి కొందరిలో నెలలు, మరికొందరిలో సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత.. వివాహబంధంలో తమకు సుఖం, సంతోషం లేవని నిర్ధారించుకుంటారు. అవన్నీ.. మరో వ్యక్తిలో వెతుక్కుంటారు. ఫలితంగా.. వివాహేతర సంబంధాలు మొదలవుతాయి. ఇవి ఎలా ముగుస్తాయో అందరికీ తెలిసిందే. కాబట్టి.. పెళ్లి చేసుకునే ముందే అన్నీ ఆలోచించుకోండి. పెళ్లి చేసుకున్నారంటే మాత్రం.. మీ భాగస్వామి గురించి, మీ పిల్లలు, మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించండి. గతాలన్నీ వదిలేసి.. అన్యోన్యంగా, ఆప్యాయంగా ముందుకు సాగండి.