Maratha Reservation Bill : విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లు కార్యరూపం దాల్చాక పది సంవత్సరాల తర్వాత దానిపై సమీక్ష చేసే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనను ఇందులో పొందుపరిచింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పరచి మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ నేత మనోజ్ జారంగే ఫిబ్రవరి 10 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పరచి బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.
మరాఠా ప్రజలు కున్‌భీ కులానికి చెందిన వారమని సంబంధిత ధ్రువీకరణ పత్రం చూపితే వారితో పాటు వారి కుటుంబసభ్యులకు కున్‌భీ కుల ధ్రువీకరణ ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కున్‌భీ వర్గం మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండగా మరాఠాలందరికీ కున్‌భీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని మనోజ్ జారంగే డిమాండ్ చేస్తున్నారు.
జనవరి- ఫిబ్రవరి నెలల్లో ‘మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్’ రాష్ట్రంలో విస్తృత సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని దాదాపు 2.5 కోట్ల మరాఠా కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించింది. విద్య, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంపై సమగ్ర నివేదికను ఇటీవల సమర్పించింది. 84 శాతం మరాఠా కుటుంబాలు వెనుకబడి ఉన్నట్లుగా అందులో తేలింది. రాష్ట్ర సగటు 17.4 శాతంతో పోలిస్తే ఈ వర్గంలో 21.22 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో మరాఠాలను రిజర్వేషన్లకు అర్హులుగా పరిగణించినట్లు బిల్లులో పేర్కొన్నారు.
బిల్లు ఆమోదంపై హర్షం
మరోవైపు మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై పలువురు నేతలు స్పందించారు. 'మరాఠా రిజర్వేజన్ బిల్లు ఆమోదం పొందడం చాలా ఆనందంగా ఉంది. ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సీఎం ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు ఫడణవీస్, అజిత్ పవార్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది' అని బీజేపీ నేత అశోక్ చవాన్ తెలిపారు.
'మరాఠా ప్రజలకు అభినందనలు'
'ఈ బిల్లుకు ఆమోదం లభించడం చాలా ఆనందంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. మరాఠా రిజర్వేషన్ల కోసం ఎన్నో త్యాగాలు చేసిన మరాఠా ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను.' అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.