Manipur CM Convoy Attack : మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్‌పై సోమవారం మెరుపు దాడి జరిగింది. భద్రతా కాన్వాయ్ వాహనాలపై పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ముందస్తు కాన్వాయ్ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాంగ్పోక్పి జిల్లాలో జరిగినట్లు వెల్లడించారు.
ఇదీ జరిగింది
జిరిబామ్ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్‌పోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ అధికారి కార్యాలయం, దాదాపు 70 ఇళ్లను శనివారం దుండగులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం దిల్లీ నుంచి ఇంఫాల్‌కు బయలుదేరిన సీఎం బిరేన్ సింగ్, జిరిబామ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిరిబామ్‌కు బయలుదేరిన సీఎం ముందస్తు కాన్వాయ్‌పై సోమవారం ఉదయం 10:30 గంటలకు జాతీయ రహదారి-53 కోట్లెన్ గ్రామ సమీపంలో దాడి జరిగింది. మిలిటెంట్లు కాన్వాయ్‌పై పలుమార్లు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు కూడా తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్ కుడి భుజంపై బుల్లెట్ తగిలిందని, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి భద్రతా దళాలు చేరుకున్నాయి. ముష్కరులను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
స్పందించిన సీఎం
ఈ దాడిని సీఎం బిరేన్ సింగ్ ఖండించారు. 'ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై దాడి జరగడం చాలా దురదృష్టకరం. సీఎంపై దాడి అంటే నేరుగా రాష్ట్ర ప్రజలపై జరిగినట్టే. ఈ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం' అని బిరేన్ సింగ్ స్పందించారు.
జిరిబామ్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచామని ఎస్పీ నమల్ మహత్తా తెలిపారు. 'ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బిందిని, ప్రత్యేక కమాండో బలగాలను మెహరించాం. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు గస్తీలో ఉన్నారు. ఇప్పటికే జిరబామ్ ప్రాంతం నుంచి దాదాపు 600 మంది అసోం వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఈ ప్రాంతంలో దాడులు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఎస్పీ తెలిపారు.
మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసులో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT