Mamata Banerjee On Her Brother : బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తన తమ్ముడు బాబూన్ బెనర్జీతో బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇందుకు గల ప్రధాన కారణాన్ని కూడా ఆమె జల్పాయిగుడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవారం తెలియజేశారు.
'తృణమూల్ కాంగ్రెస్ హవ్డా లోక్‌సభ టికెట్‌ను నా తమ్ముడు బాబూన్ బెనర్జీని కాదని పార్టీలో మరో ముఖ్య నేతగా కొనసాగుతున్న ప్రసూన్ బెనర్జీకి కేటాయించాం. ఇది బాబూన్కు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. పైగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడూ ఇలానే చేస్తారు. ఎన్నికలకు ముందు ఏదో రకంగా సమస్య సృష్టిస్తారు. అత్యాశపరులను నేను ఆదరించను. వారసత్వ రాజకీయాలను నేను నమ్మను, వాటికి దూరంగా ఉంటాను. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక ఆయనతో పూర్తిగా బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నాను' అని దీదీ స్పష్టం చేశారు.
'ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా'
తన సోదరుడు బాబూన్ బెనర్జీ బీజేపీలో చేరే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై కూడా సమాధానమిచ్చారు దీదీ. 'ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటారు. కానీ, పార్టీ మాత్రం తన అధికారిక అభ్యర్థి ప్రసూన్ బెనర్జీకి అండగా నిలుస్తుంది' అని తేల్చి చెప్పారు బంగాల్ సీఎం. ఇక ఇదే విషయమై ప్రస్తుతం దిల్లీలో ఉన్న బాబూన్ను ప్రశ్నించగా ప్రస్తుతం బీజేపీలో చేరే అవకాశం లేదని, వీలైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా హవ్డా లోక్‌సభ సీటు నుంచి బరిలోకి దిగుతానని, దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.
"హవ్డా లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో నేను సంతోషంగా లేను. ప్రసూన్ బెనర్జీ సరైన ఎంపిక కాదు. పార్టీలో చాలామంది సమర్థులైన అభ్యర్థులు ఉన్నారు. వారందరినీ విస్మరించి ఈయనకే టికెట్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ప్రసూన్ నన్ను అవమానించడాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నేనూ హవ్డా వాసినే. నాకు తెలుసు దీదీ నా మాటలను అంగీకరించరు. ఒకవేళ అవసరం ఏర్పడితే నేను ఇండిపెండెంట్‌గా హవ్డా నుంచి ఎంపీగా పోటీ చేస్తా. దీదీ ఉన్నంత కాలం నేను పార్టీ వీడే ప్రసక్తే లేదు. వీడి వేరే పార్టీలో చేరే అవకాశం అంతకన్నా లేదు. నేను క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తినే. నాకూ చాలామంది బీజేపీ నాయకులు తెలుసు. వీరంతా క్రీడలతో సంబంధం ఉన్నవారే."
- బాబూన్ బెనర్జీ, మమతా బెనర్జీ తమ్ముడు
ఇక హవ్డా పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ఎంపికైన ప్రసూన్ బెనర్జీ ఓ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్. అంతేకాకుండా టీఎంసీ తరఫున హవ్డా నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.
'ఎలక్టోరల్ బాండ్ల లెక్క ఇదీ!'- సుప్రీంకోర్టులో స్టేట్ బ్యాంక్ అఫిడవిట్
'కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'