Mamata Banerjee Injured Doctors Clarity : బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గాయపడిన విషయంపై ఇదివరకే చేసిన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్. తన నివాసంలో గాయపడ్డ మమతను వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చుసుకున్నారని డాక్టర్ మణిమోయ్ తెలిపారు. దీదీ బలమైన గాయాలు చూస్తుంటే ఆమెను వెనక నుంచి ఎవరో నెట్టినట్లు తనకు అనిపించిందని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ప్రస్తుతం దీదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే గురువారం రాత్రి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి.
'నా మాటల్లోని భావం అది కాదు'
'ముఖ్యమంత్రిని ఎవరో వెనక నుంచి తోయడం వల్లే తలకు అంతటి బలమైన గాయమైనట్లు నేను అన్నాను. ఈ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే నేను వేరే ఉద్దేశంతో అన్నాను. వెనక నుంచి నెట్టడం వల్ల ఏ విధంగా గాయాలు అవుతాయో అలా దీదీకి కూడా అయినట్లు కనిపిస్తోందన్నాను. అంతే గానీ ఎవరో నిజంగానే తోసేశారన్నది మాత్రం నా మాటల్లోని భావం కాదు. అయినా మా పని పేషెంట్లకు వైద్యం చేయడం. ఆ పనిని నిర్వర్తించాం' అని డాక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ తెలిపారు.
'సీఎం మమతా బెనర్జీ రాత్రి బాగా నిద్రపోయారు. ఆమెకు బెడ్ రెస్ట్ అవసరం. విశ్రాంతి తీసుకోమని కోరాం. ఈరోజు కూడా కొన్ని సాధారణ పరీక్షలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో దీదీ ఉన్నారు' అని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు సీఎం గాయం ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ ప్రస్తుతం దీదీ ఇంటి చుట్టూ భద్రతను మరింత పెంచినట్లుగా ఓ పోలీసు అధికారి పీటీఐతో చెప్పారు. మమతా బెనర్జీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో పాటు ఆమె నివాసం వద్ద కూడా ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
మమతా బెనర్జీ గురువారం సాయంత్రం దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ నివాసంలో ప్రమాదవశాత్తు గది నుంచి బయటకు వస్తున్న సమయంలో కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆమె నుదిటిపై, ముక్కుపై తీవ్ర గాయమైంది. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆమెను ట్రామా కేర్ సెంటర్కు తరలించారు. ఇక్కడ దీదీకి అవసరమైన అన్ని పరీక్షలు చేశారు డాక్టర్లు. ట్రీట్మెంట్ తర్వాత తన నివాసానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో దీదీ ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.
బంగాల్ సీఎం మమతకు తీవ్ర గాయం- ఆస్పత్రిలో చికిత్స- ఇంట్లో పడిపోవడం వల్లే!
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు- బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు!