Magical Eye Girl Of Kutch Gujarat : కళ్లతోనే రికార్డులు కొల్లగొడుతోంది ఈ మహిళ. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కవులు ఈమె నయనాల సౌందర్యాన్ని వర్ణిస్తూ కవిత్వాలు చిలికించారు. అత్యంత అరుదైన నేత్రాలు కలిగిన ఈమె 3 వేలకుపైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, సత్కారాలు సాధించింది. 23 గౌరవ డాక్టరేట్లు అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.
పైన వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు కరిష్మా మణి. వయసు 34 ఏళ్లు. గుజరాత్‌లోని కచ్ జిల్లా ఆదిపుర్కు చెందిన కరిష్మా తన అత్యంత అరుదైన కళ్లతో రికార్డులు కొల్లగొడుతోంది. కళ్లతో మాత్రమే కాకుండా మోడల్‌గా, యాంకర్‌గా, నటిగా రాణిస్తూ ఔరా అనిపిస్తోంది. మల్టీట్యాలెంటెడ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
అరుదైన కంటి వ్యాధి
కన్జెనిటల్ హెటెరోక్రోమియా ఇరీడియమ్, ఇది అత్యంత అరుదైన కంటి వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ప్రపంచంలో 10మంది మాత్రమే ఉన్నారట. అందులో భారత్‌లో ఉన్నది కరిష్మా మాత్రమే. ఈ వ్యాధి సోకిన వారికి రెండు కళ్ల రంగు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కారణంగానే కరిష్మా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
"నా రెండు కళ్ల రంగు భిన్నంగా ఉంటుంది. కుడి కన్ను ఆకుపచ్చ, గోధుమ రంగులు కలగలిసిన హ్యాజెల్ రంగులో ఉంటుంది. ఎడమ కన్ను బ్లాకిస్/చాకొలెట్ గోధుమ రంగులో ఉంటుంది. నా కుడి కన్ను మా నాన్న రెండు కళ్ల రంగులో ఉంటుంది. నా ఎడమ కన్ను మా అమ్మ రెండు కళ్ల రంగులో ఉంటుంది."
--కరిష్మా మణి
కరిష్మా కళ్ల సౌందర్యంపై కవితలు
అరుదైన కళ్లు కలిగిన కరిష్మా 2020లో తొలిసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్, ఉత్తర్‌ప్రదేశ్ వరల్డ్ రికార్డ్స్, అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, బిహార్ వరల్డ్ రికార్డ్స్ వంటి 3వేలకుపైగా జాతీయ, అంతర్జాతీయ రికార్డులు, పురస్కారాలు సాధించింది. 2010లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న కరిష్మా మోడల్, యాంకర్‌గా రాణించింది. నటిగా పలు టీవీ షోలు, సీరియళ్లు, సినిమాల్లో మెరిసింది. వర్డ్స్ కమ్ ఫ్రమ్ సోల్ అనే కవితా సంకలనంలో జాతీయ, అంతర్జాతీయ కవులు, కరిష్మా కళ్ల సౌందర్యంపై కవితలు చిలికించారు. అయితే కరిష్మా అరుదైన కళ్లకు గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కలేదు.
" నా కళ్ల గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు అప్లై చేశాను. ఈ విషయంపై వాళ్లతో మాట్లాడితే, కేవలం కొలిచే రికార్డ్స్‌నే తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. నేచురల్ రికార్డ్స్ కేటగిరీ లేదని చెప్పారు. పొడవైన నాలుక అనేది నేచురల్ అయినా అది కొలిచే రికార్డ్. ఉదాహరణకు 6 అంగుళాల నాలుక ఉంటే మరెవరికైనా 8 అంగుళాల నాలుక ఉందనుకుంటే దాన్ని కొలవచ్చు. ఇలాంటి రికార్డులను మనం గిన్నిస్‌లో చూశాం. అందుకే నేచురల్ రికార్డ్స్ కేటగిరీ లేదని గిన్నిస్ అధికారులు సమాధానమిచ్చారు. ప్రతి రికార్డ్స్ సంస్థలు భవిష్యత్తులో కేటగిరీలను అప్డేట్ చేస్తారు. లిమ్కా బుక్‌లో ఇద్దరు కవల సోదరులకు వేర్వేరు కళ్ల రంగులు ఉన్నందుకు అవార్డ్స్ ఇచ్చారు. కానీ నాది మహిళా కేటగిరీ."
--కరిష్మా మణి
వారి చలవే!
తనకున్నది వ్యాధి కాదని అది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు కరిష్మా తెలిపింది. తాను ఇప్పటివరకు సాధించిందంతా దేవుడు, తల్లిదండ్రులు, గురువుల చలవే అని వివరించింది. పురస్కారాలు, సత్కారాలతో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు రికార్డ్స్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపింది. అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది కరిష్మా.