Lorry Overturned Today Karnataka : కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మట్టి లోడ్‌తో వెళ్తున్న లారీ బలిగొంది. రోడ్డు పక్కన నిల్చున వారిపై ఆ లారీ బోల్తా పడడం వల్ల అక్కడికక్కడే వారంతా మృతిచెందారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిన అనంతరం లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు.
బాగల్కోట్ జిల్లాలోని బిలాగి తాలుకాలోని యత్నట్టి క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా పొలంలో పని చేసి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కనే నిల్చున్నారు. ఆ సమయంలో రోడ్డుపై మట్టితో వేగంగా వస్తున్న లారీ టైరు పేలింది. దీంతో అదుపుతప్పి ఆ లారీ రోడ్డు పక్కన ఉన్న వారిపైకి బోల్తా పడింది. వారంతా మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తులను యంకప్ప శివప్ప తోలమట్టి (72), అతడి భార్య యల్లవ యంకప్ప తోలమట్టి (66), కుమారుడు పుండలీక యంకప్ప తోలమట్టి (40), కుమార్తె నాగవ్వ అశోక బమ్మన్నవర, యంకప్ప అల్లుడు అశోక నింగప్ప బమ్మన్నవర (48)గా పోలీసులు గుర్తించారు. మరికాసేపట్లో ఇంటికి చేరిపోయే వారిని లారీ బలిగొందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ట్రక్కును ఢీకొన్న కారు- మంటల్లో ఏడుగురి సజీవదహనం
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ట్రక్కును కారు ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్. ఆదివారం మధ్యాహ్నం వారు సాలాసర్ బాలాజీ ఆలయం నుంచి కారులో హిసార్‌కు వెళ్తుండగా, వారి వాహనం ట్రక్కును వెనుక నుంచి ఢీకొంది. ఈ క్రమంలో కారులోని ఎల్‌పీజీ కిట్ పేలడం వల్ల మంటలు చెలరేగి వాహనంలో ఉన్నవారంతా సజీవ దహనమయ్యారు.
గుడిసెలో అగ్నిప్రమాదం- ముగ్గురు చిన్నారుల సజీవ దహనం
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడం వల్ల చిన్నారులైన ముగ్గురు తోబుట్టువులు సజీవ దహనమయ్యారు. కమలేశ్వర్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరిమా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో ఎనిమిది, నాలుగేళ్లు బాలికలు, రెండేళ్ల బాలుడు ఉన్నారు. రాత్రి 9 గంటల సమయంలో వారి తల్లి ఇంట్లో స్టవ్‌ను వెలిగించి, తన పెద్ద కుమార్తె కోసం బయటకి వెళ్లింది. తిరిగి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె తిరిగి రాగా ఇల్లంతా అప్పటికే దగ్ధమైంది. స్టవ్ మంటలు వ్యాపించటం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.