Loksabha Election 2024 Third Phase : పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు, వృద్ధులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్ని స్థానాల్లో కలిపి 64.58% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. అయితే ఇవి అంచనా గణాంకాలు మాత్రమేనని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నందున ఓటింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
మూడో విడతలో అత్యధికంగా అస్సాంలో 81.71% పోలింగ్ నమోదైంది. 76.52%తో బంగాల్ రెండో స్థానంలో, 75.20%తో గోవా మూడో స్థానంలో నిలిచాయి. అత్యల్పంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 57.34% మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. బిహార్, గుజరాత్‌ల్లోనూ ఓటింగ్ 60% కంటే తక్కువే నమోదైంది.
బారామతి వైపే అందరి చూపు
కర్ణాటకలో మిగిలిన 14 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ 14 స్థానాల్లో 227మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మహారాష్ట్రలో 11 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ మందకొడిగా జరిగింది. 258 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అందరికళ్లూ పవార్ కుటుంబాలకు ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానంపైనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పది స్థానాలకు మూడో విడతలో పోలింగ్ ముగిసింది. ఇక్కడ 100 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ విడతలో ములాయం కుటుంబ సభ్యులు బరిలో ఉండడం వల్ల అత్యంత ఆసక్తి నెలకొంది.
మధ్యప్రదేశ్‌లోని 9 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ ముగిసింది. బేతుల్ లోక్ సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ BSP అభ్యర్థి మరణంతో ఈ విడతలో పోలింగ్ నిర్వహించారు. 127 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, దమణ్ దీవ్ 2 స్థానాల్లో పోలింగ్ ముగిసింది.
బంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు
మూడో విడత లోక్ సభ ఎన్నికల వేళ బంగాల్‌లో పలుచోట్ల ఉద్రిక్తతలు జరిగాయి. ముర్షిదాబాద్ లోక్ సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రాణినగర్లో ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన నకిలీ ఏజెంట్‌ను CPM అభ్యర్థి మహ్మద్ సలీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హరిహరపరాలోని కాంగ్రెస్ ప్రాంతీయ అధ్యక్షుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాంబు దాడి వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారనీ, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. జంగీపూర్ లోక్ సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
అహ్మదాబాద్‌లో ఓటేసిన మోదీ
సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో 11 రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిషాన్ ఉన్నత పాఠశాలలో ప్రధాని ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఒక చిన్నారిని పిలిచి ఆమెతో ముచ్చటించారు. బీజేపీ గాంధీనగర్ అభ్యర్థి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఆయనతో పాటే ఓటు వేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఆహ్మదాబాద్‌లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలో నిలబడి ఆయన ఓటు వేశారు. గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన కుమారుడు అనుజ్ పటేల్ వీల్‌ఛెయిర్‌లో వచ్చి ఓటేశారు.
-
VIDEO | Lok Sabha Elections 2024: A 100-year-old woman, Guramma, casts her vote at a polling booth in Sindbandagi village of Bidar, Karnataka. #LSPolls2024WithPTI #LokSabhaElections2024
— Press Trust of India (@PTI_News) May 7, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/y2T1GNYGdb
జామ్‌నగర్‌లో జడేజా ఓటు
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్‌లోని షిలాజ్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోర్ బందర్ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పోర్‌బందర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్‌లో ఓటు వేశారు. మాజీ క్రికెటర్ నయన్ మోంగియా సతీసమేతంగా వడోదరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.
-
#WATCH | | Voters of Dhubri Ghat in Assam, use boats to arrive at a polling booth to cast their votes during the third phase of #LokSabhaElections2024 pic.twitter.com/wCMXQoMAcH
— ANI (@ANI) May 7, 2024
కుమారులతో వచ్చి ఓటేసిన యడియూరప్ప
కర్ణాటకలోని కలబురిగి పరిధిలోని గుండుపర్తి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు. కలబురిగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే అల్లుడు రాధాకృష్ణ పోటీ చేస్తుండగా బీజేపీ ఉమేష్ జాదవ్‌ను నిలబెట్టింది. ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారులు విజయేంద్ర, రాఘవేంద్ర శివమొగ్గలో ఓటు వేశారు. విజయేంద్ర శివమొగ్గ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ విజయంపై యడ్యూరప్ప ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తాను పోటీ చేస్తున్న హుబ్బళి స్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బారామతిలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. NCP శరచంద్రపవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సైతం బారామతిలో ఓటు వేశారు. కుమార్తె సాయంతో వచ్చిన శరద్ పవార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత బారామతిలోనే కుటుంబ సభ్యులతో కలిసి సుప్రియా సూలే ఓటు వేశారు. మహారాష్ట్రలోని షోలాపుర్లో మాజీ సీఎం సుశీల్ కుమార్ శిందే, ఆయన భార్య, కుమార్తెలతో కలిసి ఓటు వేశారు. శిందే కుమార్తే ప్రణతి శిందే షోలాపుర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో సినీనటి జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు.
-
#WATCH | Rahul says, "I have voted earlier too (for earlier elections). It feels great...#LokSabhaElections2024 https://t.co/adaFsnEvBY pic.twitter.com/L28Ccvv014
— ANI (@ANI) May 7, 2024
విదిశలో ఓటేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కుటుంబ సభ్యులు సీహోర్‌లో ఓటు వేశారు. విదిశ లోక్‌సభ స్థానం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గుణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి జోతిరాదిత్య సింధియా శివపురిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయన సతీమణి, మైన్‌పురి స్థానం అభ్యర్థి డింపుల్ యాదవ్‌తో కలిసి వచ్చి ఉత్తర్ ప్రదేశ్‌లోని సైఫయీలో ఓటు వేశారు.
బీజేపీ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ జాష్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్ దుర్గ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్‌నందగావ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
విపక్షాలకు పాకిస్థాన్‌పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024