Lok Sabha Pre Poll Survey : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి? ప్రస్తుతం ప్రజలు ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ 'మూడ్ ఆఫ్ ది నేషన్' డిజిటల్ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమే మరోసారి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఈ నెల 13 నుంచి 27 తేదీల మధ్య నిర్వహించిన డిజిటల్ సర్వేలో 7.59 లక్షల మంది పాల్గొన్నారు. అందులో 79 శాతం మంది ఎన్డీయే కూటమికే మద్దతిస్తామని వెల్లడించారు. మిగిలినవారు ప్రతిపక్ష 'ఇండియా కూటమి' వైపు నిలిచారు.
'రామమందిరానికి' జైకొట్టిన తెలుగు రాష్ట్రాల ప్రజలు
ఉత్తర భారతదేశం నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 30.04 శాతం మంది అయోధ్య రామమందిర వాగ్దానాన్ని నెరవేర్చడం మోదీ ప్రభుత్వం అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా రామమందిర అంశంపై ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇక మోదీ చేపట్టిన 'డిజిటల్ ఇండియా' ఇనీషియేటివ్ ఎంతో గొప్పదని తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనియాడారు. దేశవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 57.16 శాతం మంది ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రామమందిరమే కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. మరో 31.16 శాతం మంది ఇతరత్రా అంశాలు ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తాయన్నారు.
పీఎం పోస్టు రేసులో
ప్రధానమంత్రి పదవి కోసం ఎవరికి టాప్ ప్రయారిటీ ఇస్తారు? అని సర్వేలో పాల్గొన్న వారిని అడగగా 51.06 శాతం మంది నరేంద్రమోదీ అని చెప్పారు. పీఎం పదవికి రాహుల్ గాంధీయే ఫస్ట్ ప్రయారిటీ అని 46.45 శాతం మంది నెటిజన్లు మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీలో ఎక్కువగా కేరళ నుంచి లభించింది. ఆ రాష్ట్రం నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 50.59 శాతం మంది రాహులే ప్రధాని అయితే బాగుంటుందన్నారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో మీకు నచ్చినది ఏది అని సర్వేలో అడిగారు. సర్వేలో పాల్గొన్న వారిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) 51.1 శాతం మంది రేటింగ్ ఇచ్చారు. సీఏఏను అమల్లోకి తేవడం బీజేపీకి మైనస్ పాయింట్ అవుతుందని 26.85 శాతం మంది చెప్పారు. అయితే కమలదళంపై దీని ప్రభావం ఏ రకంగానూ ఉండదని 22.03 శాతం మంది తెలిపారు. 38.11 శాతం మంది కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రశంసించారు. 26.41 శాతం మంది డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మెచ్చుకోగా, 11.46 శాతం మంది 'ఆత్మనిర్భర్ భారత్' అత్యుత్తమ పథకమని తెలిపారు. సర్వేలో పాల్గొన్నవారిలో 80.5 శాతం మంది తమ ఓటును కులం, అభ్యర్థుల ప్రొఫైల్, ఉచిత హామీలు ప్రభావితం చేయవని చెప్పారు. కేవలం అభివృద్ధిని చూసి తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు.
మోదీ వేవ్‌ను ఇండియా కూటమి అడ్డుకోగలదా ?
మోదీ వేవ్‌ను ప్రతిపక్షాల ఇండియా కూటమి అడ్డుకోగలదా అని సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. అందులో 32.28 శాతం మంది మాత్రమే 'అడ్డుకోగలదు' అని చెప్పారు. ఇండియా కూటమి అతిపెద్ద వైఫల్యం ఏమిటని సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించగా, 48.24 శాతం మంది కీలకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ''ఇండియా కూటమికి విజన్ లేదు. నాయకత్వ లోపం ఉంది. ప్రధానమంత్రి పోస్టు కోసం చాలామంది పోటీ పడుతున్నారు'' అని బదులిచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలను మెరుగుపర్చదని 54.76 శాతం మంది అభిప్రాయపడ్డారు.
నిరుదోగ్యమే అతి పెద్ద వైఫల్యం
మోదీ ప్రభుత్వం ప్రధాన వైఫల్యాలు ఏమిటని సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు. ఇంధన ధరలు (26.2 శాతం), నిరుద్యోగం (21.3 శాతం), ద్రవ్యోల్బణం (19.6 శాతం) అని చెప్పారు. అయితే ఈవిషయంలో ఉత్తర భారతదేశ ప్రజల అభిప్రాయం మరోలా ఉంది. వారు నిరుద్యోగాన్ని(36.7 శాతం) మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యంగా చెప్పారు. తమిళనాడు ఓటర్లు ధరల పెరుగుదలను (41.79 శాతం) కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంగా తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటని అడగగా మణిపూర్ హింసాకాండ అని 32.86 శాతం మంది తెలిపారు. చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో మోదీ సర్కారు సఫలమైందా అని ప్రశ్నించగా, 21.82 శాతం మంది మాత్రమే సఫలం కాలేదన్నారు.
కంగన, మమతపై వ్యాఖ్యలు- ఎన్నికల వేళ సుప్రియ, దిలీప్‌కు ఈసీ షాక్! - EC On Bad Remarks
ఓటరు ఐడీ లేకుండానే ఓటు వేయొచ్చు- ఎలాగో తెలుసా? - How To Vote Without Voter ID Card