Lok Sabha Polls Punjab : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా, అవి ముగియగానే పంజాబ్లో మరో ఎన్నికల సమరం వచ్చే అవకాశం ఉంది! ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు విజయం సాధిస్తే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 9 నియోజకవర్గాల్లో 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉండటం గమనార్హం. ఆరు లోక్సభ స్థానాల్లో ఒక్కో ఎమ్మెల్యే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మరో మూడు స్థానాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు.
ఆప్ నుంచి వీరే!
లోక్సభ ఎన్నికల్లో పోటీపడుతున్న ఎమ్మెల్యేల్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీకి చెందినవారే తొమ్మిది మంది ఉన్నారు. మిగతా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆప్ నుంచి పోటీ పడుతున్న మంత్రుల్లో అమృత్సర్ నుంచి కుల్దీప్సింగ్, ఖాదూర్ సాహిబ్ నుంచి లల్జిత్ సింగ్ భుల్లార్, బఠిండా నుంచి గుర్మీత్ సింగ్ ఖుడియాన్, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, పటియాల నుంచి బల్బీర్ సింగ్ ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి ఎవరంటే?
అయితే కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించిన 12 మంది అభ్యర్థుల జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అమరీందర్ సింగ్ వారింగ్ లుధియానా నుంచి పోటీ చేస్తున్నారు. భోలత్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా సంగ్రూర్ నుంచి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా గుర్దాస్పుర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఈ నియోజకవర్గాల్లో ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు వీరి ప్రత్యర్థులుగా ఉన్నారు.
గతంలో ఎన్నడూ ఇలా!
రాష్ట్రంలో ఇంత మంది ఎమ్మెల్యేలు లోక్సభకు పోటీ చేస్తుండటం గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పందించారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నేతలనే తాము లోక్సభ అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలిపారు. దిల్లీలో కూడా పలువురు ఎమ్మెల్యేలను బరిలోకి దించామని చెప్పారు. వారు గెలిస్తే కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు.
మాకేం భయం లేదు : మాన్
ఉప ఎన్నికలంటే తమకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు మాన్. బాగా మాట్లాడే అభ్యర్థులనే తాము ఎంచుకున్నామని, వారందరికీ రాష్ట్ర అసెంబ్లీలో అనుభవం ఉందని అని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పంజాబ్లో 13 లోక్సభ నియోజకవర్గాలకు చివరి దశలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.