Lok Sabha Polls 2024 Fourth Phase : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జరిగిన నాలుగో విడతలో మెుత్తంగా 67.70 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం- EC వెల్లడించింది. నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సోమవారం దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, బంగాల్‌లలో మాత్రం కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నాలుగో దశలో 67.70శాతం పోలింగ్ నమోదైందని అయితే ఇది తాత్కాలిక సమాచారమేనని EC వెల్లడించింది. వివిధ ప్రాంతాల నుంచి పూర్తిస్థాయి గణాంకాలు అందిన తర్వాత ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తాజా విడతలో అత్యధికంగా బంగాల్‌లో 78.44 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో అత్యల్పంగా కేవలం 37.98 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంది. అయితే గత కొన్ని దశాబ్దాల్లో జమ్మూకాశ్మీర్‌లోఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఈసీ తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాజహాన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామాలు రోడ్ల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోవడం లేదని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఝార్ఖండ్‌లో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సోనాపీ, మెురాంగ్‌పొంగా ప్రాంతాల్లో చెట్టును కొట్టి అడ్డుగా వేయడం ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాకను అడ్డుకోవాలని మావోయిస్టులు ప్రయత్నించగా భద్రతా బలగాలు ఆ అడ్డును తొలగించాయి. ఒడిశాలో పలుచోట్ల EVMలు మొరాయించాయి. దీంతో విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది.
ఉచితంగా అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ఓటు వేశారు. ఇందౌర్‌లో ఓటు వేసేందుకు తెల్లవారుజాము నుంచే భారీ క్యూలు ఉండడం వల్ల ఓటర్లకు ఉచితంగా అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు అందించారు. బంగాల్‌లో బీజేపీ-టీఎంసీ శ్రేణుల పలుచోట్ల ఘర్షణ చెలరేగింది. దుర్గాపుర్‌లో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. భద్రతా దళాలు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈవీఎంలు పని చేయకపోవడం, ఏజెంట్ల అడ్డగింత వంటి ఫిర్యాదులు వెయ్యికి పైగా అందినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ కంప్లీట్
అయితే నాలుగో విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లోని ఒక లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది.
అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖులు వీళ్లే
నాలుగో విడత పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన అధీర్ రంజన్ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తృణమూల్ తరపున కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేశారు. కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా బంగాల్ లోని అసన్సోల్ నుంచి తృణమూల్ తరపున పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు.