MP Engineer Rashid : కశ్మీర్ ప్రజలను విభజించేందుకు కాదు, ఐక్యం చేసేందుకు జైలు నుంచి వచ్చానని బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ తెలిపారు. ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దిల్లీలోని తిహాడ్ జైల్లో ఉన్న ఆయన, బెయిల్పై తాజాగా బయటకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నేను ఐదున్నరేళ్లుగా జైలులో ఉన్నాను. ఇప్పుడు ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రజలను విభజించడానికి కాదు, వారిని కలపడానికే వచ్చాను. కశ్మీర్‌లో శాశ్వత శాంతిని తీసుకురావాలనుకుంటున్నాను. కశ్మీరీలు రాళ్లదాడి చేసేవారు కాదని నిరూపించాలనుకుంటున్నాను. రాజకీయంగా పొందే హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ప్రధాని చెప్పిన నయా కశ్మీర్ విధానంపైనా పోరాటం కొనసాగుతుంది'' అని రషీద్ స్పష్టం చేశారు.
#WATCH | Delhi: After being released from Tihar Jail on interim bail, Baramulla MP Engineer Rashid, says " i will not let down my people. i take a pledge that i will fight pm modi's narrative of 'naya kashmir', which has failed totally in j&k. people have rejected whatever he did… pic.twitter.com/sTTTLw8TRu
— ANI (@ANI) September 11, 2024
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో ఇంజినీర్ రషీద్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తిహాడ్ జైల్లో ఉన్నారు. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో అక్టోబర్ ఒకటి వరకు జరగనున్న జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం బెయిల్ ఇవ్వాలని రషీద్ చేసిన అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయన లంగేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008, 2014లో విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. బారాముల్లా నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి, విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా ప్రమాణస్వీకారం నిమిత్తం జులై 5న న్యాయస్థానం ఆయనకు కస్టడీ పెరోల్ ఇచ్చింది. త్వరలో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటీవల ఎన్నికల ప్రచారం నిమిత్తం బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దాని గడువు అక్టోబర్ రెండుకు పూర్తికానుంది.
2019లో ఆర్టికల్ 370 రద్దవడం వల్ల రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఐదు దశల్లో జరిగాయి. ఈసారి మూడు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.