Lok Sabha Elections Congress Fourth List : లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితాను విడుదల చేసింది. రాజ్‌గఢ్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేయనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ బరిలోకి దిగనున్నారు. తమిళనాడులోని శివగంగ నుంచి కార్తీ చిదంబరం, విరుదునగర్ నుంచి మాణికం ఠాగూర్ పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 9, తమిళనాడులో 7, రాజస్థాన్‌లో 3, ఉత్తరాఖండ్, మణిపుర్, జమ్ము కశ్మీర్‌లో రెండేసి స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వాటితోపాటు అసోం, ఛత్తీస్‌గఢ్, బంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఒక స్థానానికి అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తాజా జాబితాతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 184 మంది అభ్యర్థులను ప్రకటించింది.
-
Congress releases the fourth list of 46 candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 23, 2024
Congress leader Digvijay Singh to contest from Rajgarh Lok Sabha Constituency, UP Congress President Ajay Rai from Varanasi, Imran Masood from Saharanpur, Virender Rawat from Haridwar and… pic.twitter.com/wpnr6kvoUr
ప్రధాని మోదీపై పోటీ
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నియోజకవర్గం నుంచి ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ పోటీ చేయనున్నారు. అజయ్‌రాయ్ ఇదివరకే అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ రకంగా మోదీపై పోటీ ఇది మూడోసారి కానుంది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో రాజకీయ జీవితం ప్రారంభించారు రాయ్. 1996-2007 మధ్య మూడుసార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2012లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల బీఎస్పీ నుంచి వచ్చి చేరిన లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీకి అమ్రోహా సీటు కేటాయించింది. బారాబంకి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు పీఎల్ పునియా తనయుడు తనూజ్ పునియా పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో రాజ్‌గఢ్ నుంచి సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్, రత్లాం నుంచి కాంతిలాల్ బూరియాను బరిలోకి దింపింది. తమిళనాడులోని విరుధునగర్ నుంచి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ను రంగంలోకి దింపింది. అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అయిన సినీనటి రాధికా శరత్‌కుమార్‌తో తలపడనున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ ఠాక్రే పోటీ చేయనున్నారు.
అభ్యర్థుల జాబితాపై సమావేశం
మరోవైపు లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం రాత్రి దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యలు పాల్గొన్నారు. ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, రాజస్థాన్ అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బిజూ జనతాదళ్‌తో పొత్తు కుదరకపోవడం వల్ల 21 లోక్‌సభ స్థానాలతోపాటు 147 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చించినట్లు ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తెలిపారు. ఒడిశాలోని సంబల్‌పుర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 291 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.