Lok Sabha Elections 2024 First Phase : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వేసవి దృష్ట్యా ఉదయమే ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిదశలో 102 స్థానాల్లో ఓటింగ్ జరగ్గా, 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 62.37 శాతం ఓట్లు పోలయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి దశ పోలింగ్‌లో బంగాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు 77.57శాతం ఆ రాష్ట్రంలో ఓటింగ్ నమోదైంది.
ఓటేసిన 102 ఏళ్ల బామ్మ
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో 102 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ఆమ్గే మహారాష్ట్ర నాగపుర్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి, అందరితోపాటు క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు. అనంతరం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, దేశ పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో నవదంపతుల సందడి!
మొదటి దశ పోలింగ్‌లో పలు ప్రాంతాల్లో నవ దంపతులు తమ ఓటు హక్కును వినియెగించుకున్నారు. జమ్ముకశ్మీర్ ఉధంపుర్‌లో నవ వధూవరులు ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పెళ్లి వస్త్రాల్లోనే ఓటు వేసేందుకు వారు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గురువారం తమకు వివాహం జరిగిందన్న పెళ్లి కూతురు, తమ ఓట్లను వృథా చేయకూడదన్న ఉద్దేశంతో భర్తతో కలిసి ఓటు వేసినట్లు చెప్పారు. రాజస్థాన్ జయపురలో గురువారం రాత్రి వివాహం జరిగిన నవ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివాహ క్రతువులో భాగమైన వీడ్కోలు కార్యక్రమం ముందు మోహన్‌పురాలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసినట్లు పెళ్లికూతురు తెలిపింది.
ఓటేసిన ప్రముఖులు
మరోవైపు, తొలివిడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన సతీమణితో కలిసి వెళ్లి చెన్నైలో ఓటు వేశారు. సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటేశారు. మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం శివగంగలో ఓటు వేశారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్. చెన్నైలోని సాలిగ్రామం కేంద్రంలో ఓటు వేశారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటేశారు.
సినీ ప్రముఖులు కూడా!
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెన్నై కోయంబేడులోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. దళపతి విజయ్ నీలంకరైలో ఓటేశారు. అజిత్ తిరువాన్మియూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. విజయ్ సేతుపతి చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకోగా ధనుష్ అల్వార్ పేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ నటులు సూర్య, ఆయన సోదరుడు కార్తి, నటి త్రిషా కృష్ణన్, హాస్యనటుడు యోగి బాబు చెన్నైలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.