Election Staff Journey For One Voter : క్రూర మృగాలు సంచరించే దట్టమైన అడవి.. ముగ్గురు మహిళలు సహా అధికారులు కాలినడకన ప్రయాణం.. సెలయేరు వద్ద సేద తీరుతూ.. ఎత్తైన కొండలు ఎక్కుతూ.. అడ్డంకులన్నీ దాటుతూ సాహసం.. ఎన్నికల అధికారులు ఇవన్నీ చేసింది కేవలం ఒక్క ఓటు కోసం మాత్రమే.
కేరళ ఇడుక్కి జిల్లాలోని ఎడమలక్కుడి అనే మారుమూల గ్రామంలో నివసించే శివలింగం అనే 92 ఏళ్ల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ అధికారులు ఈ సాహసం చేశారు. వయసు మీదపడి మంచానికి పరిమితమైన శివలింగానికి ఓటు వేయాలనే సంకల్పం బలంగానే ఉంది. దీంతో ఆయన 'ఇంటి నుంచి ఓటు' కోసం దరఖాస్తు చేసుకున్నారు. శివలింగం అభ్యర్థనకు ఎన్నికల యంత్రాంగం ఆమోదం తెలిపింది.
18 కిలోమీటర్లు దట్టమైన కొండ ప్రాంతంలో ప్రయాణించి!
Kerala Lok Sabha Election 2024 : మారుమూల గ్రామంలో ఉన్న ఆ ఓటరు కోసం ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది అధికారులతో కూడిన పోలింగ్ సిబ్బందిని ఎన్నికల యంత్రాంగం నియమించింది. ఎన్నికల సామగ్రితో బుధవారం ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన సిబ్బంది, 18 కిలోమీటర్లు దట్టమైన కొండ ప్రాంతంలో ప్రయాణించారు. మార్గమధ్యలో సెలయేళ్లు, రాళ్లు వంటి అడ్డంకులను దాటారు. చివరకు మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకున్నారు.
శివలింగం భావోద్వేగం!
గ్రామంలోని శివలింగం ఇంటికి వెళ్లి మంచం పక్కనే పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. దీంతో తన మనవడి సాయంతో ఓటు వేసిన శివలింగం, భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి కన్నీటితో వీడ్కోలు పలికారు. గ్రామానికి చేరుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ఆనందంగా ఉందని తెలిపారు పోలింగ్ సిబ్బంది.
పోలింగ్ సిబ్బందికి సత్కారం!
సవాలుతో కూడిన మిషన్‌ను పూర్తి చేసినందుకు ఎడమలక్కుడి గ్రామానికి వెళ్లిన పోలింగ్ సిబ్బందిని సత్కరించనున్నట్లు జిల్లా సబ్ కలెక్టర్ వీఎం జయకృష్ణన్ వెల్లడించారు. పలువురు అధికారులు కూడా ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది అధికారులపై ప్రశంసలు కురిపించారు.