Wine Shops To Be Closed For Two Days in Hyderabad : వరుసగా ప్రతినెలా ఏదో ఒక కారణంతో ఒకటీరెండు రోజులు మద్యం షాపులు మూత పడుతున్నాయి. లోకసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి నేపథ్యంలో.. ఏప్రిల్, మే, జూన్ నెలలోని పలు తేదీల్లో వైన్స్ షాపులు మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మరి.. ఈసారి ఎందుకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నారు? ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో బోనాల వేడుకలను వైభవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భక్తులు అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున పెద్ద ఎత్తున భాగ్యనగరంలో మహంకాళీ బోనాల(Mahankali Bonalu) వేడుకలను నిర్వహించనున్నారు. అందుకోసం ఇప్పటికే నగరవాసులు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లూ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైన్స్ షాపులు మూసేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బోనాల పండుగ సందర్భంగా భాగ్యనగరంలో.. స్టార్ హోటళ్లు, నాన్ ప్రొప్రయిటరీ క్లబ్‌లు, రెస్టారెంట్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలూ జులై 28న మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు బార్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. జులై 28 మార్నింగ్ 6 గంటల నుంచి రెండు రోజులపాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. సౌత్ ఈస్ట్ జోన్‌లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం 24 గంటల వరకే వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. డ్రై డే రోజున చాటుగా మద్యం విక్రయాలు చేసినా.. కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాల వేడుకల సందర్బంలో అంబారీపై అమ్మవారి ఊరేగింపు సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఊరేగింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నగరవాసులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు కొనసాగించాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి :
ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి - పంటలు బాగా పండుతాయి - రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత!
హైదరాబాద్ టీ హబ్‌లో బోనాల పండుగ - 101 మంది పోతురాజులతో ప్రత్యేక ప్రదర్శన!