Lawyer Suggestions on Divorce: ప్రస్తుతం లవ్ మ్యారేజెస్ కామన్ అయిపోయాయి. అయితే.. టీనేజ్‌లో కలిగే ఆకర్షణనే ప్రేమగా పొరబడి పెళ్లి చేసుకుంటున్నవారు.. ఆ తర్వాత విడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే.. విడిపోయే క్రమంలో చట్ట ప్రకారం నడుచుకోకపోవడంతో ఆ తర్వాత కాలంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాలు తెలియక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి ఓ ఇబ్బందే ఈ స్టోరీ! దీనికి న్యాయ నిపుణులు ఎలాంటి సలహా ఇచ్చారో ఈ స్టోరీలో చూద్దాం.
సమస్య ఏంటంటే: ఒక అమ్మాయి - అబ్బాయి ప్రేమించి గుళ్లో వివాహం చేసుకున్నారు. మూడు సంవత్సరాల కాపురం తర్వాత.. మనస్పర్థల కారణంగా విడిపోయారు. పెద్దల సమక్షంలో ఎవరిదారి వారిదని అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. ఆ వ్యక్తి రెండో భార్యతోనూ విడిపోయాడు. ఇప్పుడు మళ్లీ నాకు మొదటి భార్య కావాలని కోరుతున్నాడు. అంతేకాదు.. తాను చట్టప్రకారం మొదటి భార్యకు విడాకులివ్వలేదు కాబట్టి రెండో పెళ్లి చెల్లదనీ, ఎలా చూసుకున్నా ఆమె తన భార్యే అంటున్నాడు. ఆమెతోనే కాపురం చేస్తానని గొడవ చేస్తున్నాడు. దీంతో.. సదరు అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్నీ మరిచిపోయి రెండో పెళ్లి చేసుకున్న తన కూతురిని ఇబ్బంది పెడుతున్నాడని.. ఏం చేయాలో అర్థం కావట్లేదని న్యాయ నిపుణులను సలహా కోరారు. చట్ట ప్రకారం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవొచ్చో తెలపాలని అడిగారు. మరి.. ఈ సమస్యకు న్యాయ నిపుణులు ఏ సమాధానం ఇచ్చారో చూద్దాం.
తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం.. గుజరాత్లో కొత్త రూల్! రాజ్యాంగం అనుమతిస్తుందా?
ఇలా చేయాలట..
గుళ్లో పెళ్లి చేసుకున్నారంటే.. కేవలం దండలు మార్చుకుంటే అది పెళ్లిగా లెక్కించరు. కచ్చితంగా హిందూ వివాహ సంప్రదాయాలను అనుసరిస్తేనే చట్టబద్ధ వివాహంగా గుర్తిస్తారని న్యాయ నిపుణులు వరలక్ష్మి చెబుతున్నారు. అదే సమయంలో.. పెద్ద మనుషుల సమక్షంలో కాగితాల మీద రాసుకున్న విడాకులకు చట్ట పరంగా ఎటువంటి విలువా ఉండదని.. తప్పనిసరిగా కోర్టు నుంచే డివోర్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. విడాకులు తీసుకోకుండా అమ్మాయికి చేసిన రెండో పెళ్లి చట్ట సమ్మతం కాదని చెబుతున్నారు.
అయితే.. మొదటి భార్యకు విడాకులివ్వలేదు కాబట్టి ఆమెతోనే ఉంటానని అతడనుకుంటే సరిపోదని.. అమ్మాయికి అతడితో ఉండటం ఇష్టం లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్‌లోని సెక్షన్ -13 ప్రకారం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేయొచ్చని సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి అమ్మాయి బయట పడాలంటే.. ముందు విడాకులకు దరఖాస్తు చేయించాలని సూచిస్తున్నారు. దాంతోపాటుగా మొదటి భర్త తన జీవితంలోకి అనవసరంగా ప్రవేశించకుండా.. తన ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూడాలంటూ.. కోర్టులో ఇంజంక్షన్ పిటిషన్ కూడా వేయాలని సూచిస్తున్నారు.
భర్త హోదాతో మహిళను వేధించే హక్కు లేదని.. అతని వేధింపులు కొనసాగితే ఈ విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అదేవిధంగా.. విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయి రెండో పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచిస్తున్నారు. అమ్మాయి రెండో భర్తకు ఈ విషయాలన్నీ చెప్పి, సానుకూలంగా ముందుకు వెళ్లాలని.. లేదంటే ఇద్దరి మధ్య అపార్థాలు, గొడవలు వస్తాయని సలహా ఇస్తున్నారు.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.