Bengal Doctor Murder Case : బంగాల్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి ఆర్థిక అవకతవకలపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆర్జీ కర్ ఆస్పపత్రిలో 2021 నుంచి జరిగిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని ఆదేశించింది. సిట్ అధిపతిగా ఐజీ ప్రణవ్ కుమార్‌ను నియమించింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, వైద్యురాలి హత్యాచారం నేపథ్యంలో విమర్శలు ఎదురుకుని రాజీనామా చేసిన సందీప్ ఘోష్ 2021లో ఆర్జీ కర్ ప్రిన్సిపల్‌గా నియామకమయ్యారు.
మాజీ ప్రిన్సిపాల్‌పై పలు అనుమానాలు
మరోవైపు, వైద్యురాలి అత్యాచారం కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సోమవారం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వైద్యురాలి మరణ వార్త తెలిసిన అనంతరం ప్రిన్సిపాల్ ఎవ్వరిని సంప్రదించారు. వైద్యురాలి మృతదేహాన్ని చూడటానికి ఆమె తల్లిదండ్రులను మూడు గంటల వరకూ ఎందుకు ఆపారు? సందీప్ ఘోష్ కాల్ రికార్డుతో పాటుగా ఆయన వాట్సప్ చాట్‌ను సైతం పరశీలిస్తున్నారు. మాజీ ప్రిన్సిపాల్ చెప్పే సమాధానాలపై సీబీఐ సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అందుకే గత మూడు రోజులుగా మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది.
పాలీగ్రాఫ్ పరీక్షకు కోర్టు అనుమతి
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని సీబీఐ అధికారులు మరోమారు విచారించారు. అత్యాచారం జరిన సమయంలో సంజయ్ అక్కడ ఉన్నాడా లేదా? అతను ఒక్కడే అక్కడ ఉన్నాడా? లేదా అతనితో ఇంకా ఎవ్వరైనా ఉన్నారా? అనే కోణంలో సీబీఐ విచారణ చేపడుతుంది. ఈ కేసులో సంజయ్‌కి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి స్థానిక కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం నిందితుడిని కోర్టు ముందు హాజరు పరచాలని, అతడు అనుమతి ఇస్తేనే పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు.
'వాళ్ల వేళ్లు విరగ్గొడతాం'
వైద్యురాలి హత్యాచారం విషయంలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ, మమతా బెనర్జీ రాజీనామా కోసం డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇదే అంశంపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి ఉదయన్ గుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతను రాజీనామా చేయాలనే వారి వేళ్లు విరుగుతాయంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ విడియో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను 'ఈటీవీ భారత్' ధ్రువీకరించలేదు.
"మమతా బెనర్జీపై ఆరోపణలు చేసేవారు, మమతపై వేలు ఎత్తి చూపేవారు, ఆమె రాజీనామాను కోరేవారు ఎప్పటికి విజయం సాధించలేరు. మమతవైపు వేళ్లు చూపేవారి వేళ్లు విరగ్గట్టి నలిపేస్తాం. విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారింది. అక్కడ జరిగినట్లుగా బంగాల్లో ఎన్నటికీ జరగదు" అని వైరల్ అయిన వీడియో మంత్రి ఉదయన్ అన్నారు.