Supreme Court Hearing On Doctor Murder Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు, గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. విధుల్లోకి చేరిన తర్వాత వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చింది. వైద్యులు విధులు నిర్వర్తించకపోతే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. వైద్యుల ఆందోళనతో పేదలు నష్టపోకూడదని పేర్కొంది.
''వైద్యం కోసం వస్తున్న పేదలను విస్మరించలేం. మీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదు. మీరు వెంటనే విధుల్లో చేరండి. మీరు విధుల్లో చేరిన తర్వాత మీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తాం'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఆసుపత్రుల్లో వసతులు, పని పరిస్థితులు ఎలా ఉంటాయో మేం అర్థం చేసుకోగలం. నేను కూడా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాను. ఒకసారి మా కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆ రోజు నేను నేలపైనే నిద్రించాల్సి వచ్చింది. దాదాపు 36 గంటల పాటు వైద్యులు ఏకధాటిగా పని చేస్తుంటారు'' అని సీజేఐ గుర్తుచేసుకున్నారు.
'టాస్క్‌ఫోర్స్ కమిటీలో రెసిడెంట్ డాక్టర్లను చేర్చండి'
దేశవ్యాప్తంగా డాక్టర్లు, మహిళల రక్షణకు జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ డాక్టర్లు, నిపుణులు సహా 10 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీలో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని వారి తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దీనికి బదులిస్తూ, జాతీయ టాస్క్‌ఫోర్స్ కమిటీ అందరినీ సంప్రదిస్తుందని అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది.
"మృతురాలికి ఆగస్టు 9న సాయంత్రం 6.10 నుంచి 7.10 గంటల మధ్య పోస్టుమార్టం నిర్వహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 9వ తేదీ సాయంత్రం 6.10 గంటలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాన్ని అంత్యక్రియలకు కోసం రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరి, రాత్రి 11.30 గంటలకు పోలీసు స్టేషన్‌లో వైద్యురాలిది అసహజ మరణం అని ఎలా నిర్థరించారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఘటనపై మొదటి ఎంట్రీని నమోదు చేసిన కోల్‌కతా పోలీసు అధికారి తదుపరి విచారణకు హాజరు కావాలి" అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ
డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు పురోగతిపై నివేదికను సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మంగళవారం(ఆగస్టు 20) విచారణ చేపట్టిన సుప్రీం, సీబీఐని స్టేటస్ రిపోర్టు కోరింది.