Kerala Government OTT Platform : వినోద పరిశ్రమలో ఓటీటీ మార్కెట్‌కు ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ విస్తరిస్తోంది. ఇప్పటివరరు ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు ఓటీటీ సర్వీసులను అందించనున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం సీస్పేస్ పేరుతో ఓటీటీ సర్వీస్‌ను ప్రారంభించింది.
తిరువనంతపురంలోని కైరాలీ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్ సీస్పేస్ ఓటీటీ ప్లాట్‌పామ్‌ను గురువారం ప్రారంభించారు. ప్రైవేట్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రధాన ఉద్దేశం లాభాన్ని ఆర్జించడమేనని, ఎక్కువగా కమర్షియల్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయని తెలిపారు. సీస్పేస్ మలయాళం భాషా సంస్కృతిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి తెలుసుకుందాం రండి.
పే-పర్-వ్యూ పద్దతిలో!
సీస్పేస్ ఓటీటీలో యూజర్లు పే-పర్-వ్యూ ఆధారంగా సినిమాలను చూడవచ్చు. రూ.75 ధరకే యూజర్లు చిత్రాలను చూడొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్ మొత్తానికి ప్రేక్షకులు చెల్లించాల్సిన అవసరం లేదు. చూసిన సినిమాలకు మాత్రమే చెల్లిస్తే చాలు. 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌లు 40 రూపాయలకు, 30 నిమిషాల ఫిల్మ్‌లు 30 రూపాయలకు, 20 నిమిషాల ఫిల్మ్‌లు 20 రూపాయలకు చూడవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సగం వారికి- సగం వీరికి!
ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలు, ఫిల్మ్ అకాడమీ నిర్మించిన చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు, ప్రయోగాత్మక చిత్రాలు అందుబాటులో ఉంటాయి. ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయంలో సగం ఫిల్మ్ అకాడమీకి , మిగిలిన సగం సినిమా నిర్మాతకు వెళ్తుంది. నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ కూడా చేసుకోవచ్చు.
60 మందితో ప్యానెల్
అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్‌ను ఎంపిక చేసేందుకు 60 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ నియమించారు. సీస్పేస్ కోసం ఇప్పటి వరకు 42 చిత్రాలను ఎంపిక చేశారు. ప్యానెల్ అనుమతి పొందిన షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తారు. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.