మద్యం పాలసీ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో 4రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరింత కస్టడీ విచారణ అవసరమని ఈడీ కోర్టును కోరగా, విచారణ జరిపిన కోర్టు ఆదేశాలిచ్చింది. గోవాకు చెందిన ఆప్ అభ్యర్థుల వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లు చెప్పింది. విచారణలో కేజ్రీవాల్ తమకు సహకరించడం లేదని ఆరోపించింది. కస్టడీ సమయంలో కేజ్రీవాల్ ఎలాంటి పాస్‌వర్డ్‌ను వెల్లడించలేదని చెప్పింది. అయితే ఓ ముఖ్యమంత్రి కూడా చట్టానికి అతీతులు కాదని ఈడీ పేర్కొంది.
దిల్లీ మద్యం కుంభకోణంలో ఈనెల21న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ, ఈనెల 28వ తేదీ వరకు కూడా కస్టడీలోకి తీసుకుంది. కస్టడీ గడువు ముగియటం వల్ల గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా తన తరఫున తానే కేజ్రీవాల్ వాదనలు వినిపించారు.
'నలుగురి మాటలు చాలా?'
"2022 ఆగస్టు 17వ తేదీన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2022 ఆగస్టు 22వ తేదీ ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. నన్ను అరెస్టు చేశారు. కానీ ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిర్ధరించలేదు. సీబీఐ 31,000 పేజీలు, ఈడీ 25,000 పేజీలు ఈ విషయానికి సంబంధించి దాఖలు చేసింది. మీరు వాటిని కలిపి చదివారా? అసలు నన్ను ఎందుకు అరెస్టు చేశారు? సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి నలుగురు వ్యక్తులు చేసిన ప్రకటనలు సరిపోతాయా?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
'విచారణకు సిద్ధం'
ఈ కేసులో ప్రజలను అప్రూవర్‌లుగా మారుస్తున్నారని, ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. "మీకు నచ్చినంత కాలం నన్ను రిమాండ్‌లో ఉంచవచ్చు. విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు. ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం మొదలవుతుందని, ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ఈడీ ఉద్దేశమని ఆయన అన్నారు. కేజ్రీవాల్ కస్టడీకి సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారని ఆయన తరఫున న్యాయవాది రమేశ్ గుప్తా తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని అంగీకరించారని చెప్పారు.
'దిల్లీలో రాజ్యాంగ సంక్షోభం'
దేశ రాజధాని రాజ్యాంగ సంక్షోభం ఎదుర్కొంటుందని, అరవింద్ కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. దిల్లీ ప్రజల పట్ల కనీస గౌరవం ఉంటే, ఆప్ మరో ముఖ్యమంత్రిని నియమించాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం అంతర్గత పోరు నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఆరోపించారు. ప్రపంచంలో ఎవరైనా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లు ఒక ఉదాహరణ చూపించండని సచ్‌దవ్ డిమాండ్ చేశారు.
- 02.50 PM
తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేందుకు వేర్వేరు వ్యక్తులు ఆడిన నాలుగు మాటలు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ఈడీ ఉద్దేశమని ఆరోపణలు చేశారు. "నన్ను అరెస్టు చేశారు, కానీ ఏ కోర్టు నన్ను దోషిగా నిర్ధరించలేదు. సీబీఐ 31,000 పేజీలు దాఖలు చేసింది. ఈడీ 25,000 పేజీలు దాఖలు చేసింది. మీరు వాటిని కలిపి చదివారా? అసలు నేను నన్ను ఎందుకు అరెస్టు చేశారు?" అని ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రైనా చట్టానికి అతీతులు కారని ఈడీ వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్‌ను మరో 7రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ కోరగా.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. - 2.20 PM
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరో 7రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది.
Kejriwal ED Custody Live Updates : గురువారం ఈడీ కస్టడీ ముగియనుండటం వల్ల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు రూమ్‌లోకి వెళ్తూ 'ఇది రాజకీయ కుట్ర, ప్రజలే సమాధానం చెబుతారు' అని కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు, కేజ్రీవాల్‌ను మరి కొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టు కోరే అవకాశం ఉంది.
కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టు ఊరట
ఇదిలా ఉండగా, కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
ఇదీ నేపథ్యం
మద్యం విధానం కేసును మార్చి 22న రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను దిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. 7రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అయితే ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఈ అంశంపై రెండున్నర గంటల పాటు వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ అంశంపై తీర్పును వెలువరించారు. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21 రాత్రి ఈడీ అధికారులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. మార్చి 22న భారీ భద్రత మధ్య దిల్లీలోని ఈడీ కోర్టులో హాజరు పరిచారు.