Kejriwal ED Arrest : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టుతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానం నాటకీయ మలుపు తిరిగింది. ఒకప్పుడు అవినీతి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించి మూడు పర్యాయాలు దిల్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్, ఇప్పుడు అదే అవినీతి అరోపణలతో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ఇండియా కూటమితో కలిసి దిల్లీ, హరియాణా, గుజరాత్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సాగుతున్న తరుణంలో ఈ అరెస్టు జరిగింది. అయితే ఎన్నికల ముంగిట పార్టీ కార్యకలాపాలు, వ్యూహ రచన, అమలులో కేజ్రీవాల్ కేంద్రంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అరెస్టు ఎన్నికల్లో ఆప్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్టు, ఆయనకు విశ్వసనీయ సహాయకులు అయిన సంజయ్ సింగ్, మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ జైలులో ఉండటం, కొంత మంది నేతలు అజ్ఞాతంలో ఉండటం వల్ల పార్టీలో అనిశ్చితి నెలకొంది.
కేజ్రీవాల్ వారసత్వం ఎవరికో!
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది. విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారిణి అయిన కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, దిల్లీ కేబినెట్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ పేర్లు కేజ్రీ రిప్లేస్మెంట్కు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2012లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కన్వీనర్‌గా ఉంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఒంటిచేత్తో పార్టీని నడిపించి దేశంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి ఆప్‌ని తీసుకువెళ్లారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఆయన అరెస్టు కావడం వల్ల వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి.
అయితే, మద్యం కుంభకోణం కేసులో ఒకవేళ అరెస్టయితే కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయాలా అని గత డిసెంబరులోనే ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రాజీనామా అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఆయనే పాలన సాగించాలని 90% మంది అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయాన్ని ఆప్ వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని తెలిపారు.
కేజ్రీ అరెస్టు జరిగిందిలా
దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ వాటిని నిరాకరించారు. అంతేకాకుండా అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను గురువారం తోసిపుచ్చిన హైకోర్టు ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. వెంటనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సోదాలు చేసి, కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకోగానే ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు సైతం ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి.