Kejriwal Arrest Supreme Court : సార్వత్రిక ఎన్నికలకు ముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవని, మీరు వాటిని కాదనలేరు అని పేర్కొంది. ఈ కేసులో న్యాయపరమైన విచారణలు లేకుండా క్రిమినల్ చర్యలను దర్యాప్తు సంస్థ చేపట్టవచ్చో? లేదో? చెప్పాలని వెల్లడించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మేరకు స్పందించింది.
ఈ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి జప్తు చర్యలు తీసుకోలేదని, ఒకవేళ తీసుకుంటే ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ ప్రమేయం ఏవిధంగా ఉందో చూపాలని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజుకు జస్టిస్ ఖన్నా తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్టు చేయడం? అని ప్రశ్నించారు.
Delhi Excise Policy Scam : 2021-22కు మద్యం పాలసీ రూపకల్పనలో అవినీతి, మనీలాండరింగ్ జరిగాయన్న కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో భాగంగా దిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.
సిసోదియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
దిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. సిసోదియాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. విచారణలో జాప్యం జరుగుతున్నందున బెయిల్ ఇవ్వాలని సిసోదియా పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సిసోదియా తరఫు న్యాయవాది తెలిపారు. గతేడాది కూడా మనీశ్ సిసోదియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దిల్లీ మద్యం కేసులో సిసోదియా 2023 ఫిబ్రవరి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్- 10మంది మావోయిస్టులు హతం - Encounter In Chhattisgarh