Kathak Dance World Record : ఒకేసారి 1,484 మంది కళాకారులు కలిసి కథక్ నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురాహోలో ఘనంగా జరిగిన డ్యాన్స్ ఫెస్టివల్లో కళాకారులు అందరూ కలిసి 20 నిమిషాల పాటు కథక్ నృత్యం ఈ రికార్డ్‌ను సృష్టించారు. అయితే నెల క్రితం గ్వాలియర్లోనే తాన్సేన్ సమారోహ్ ఆధ్వర్యంలో జరిగిన తాల్ దర్బార్ కార్యక్రమంలో 1,282 మంది తబలా కళాకారులు గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు.
20 నిమిషాల ప్రదర్శన
ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన ఖజూరాహోలో ఫిబ్రవరి 20న 50వ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు వచ్చి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా 1484 మంది కళాకారులు కలిసి ఏకరూప దుస్తుల్లో దేవాలయ ప్రాంగణంలో కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. 'రాగ బసంత్' అనే పాటకు సుమారు 20 నిమిషాలు నృత్యం చేశారు. వారిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఉన్నారు. వారితో పాటు విదేశీ కథక్ కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో జబలపుర్కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు.
వర్చువల్ ప్రాక్టీస్
ఈ నృత్య ప్రదర్శన కోసం దాదాపుగా నెల రోజుల నుంచి కళాకారులు ప్రాక్టీస్ చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల వర్చువల్‌గా సాధన చేశారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్షలకు సిద్ధమవుతూనే మరో పక్క కథక్ నృత్యాన్ని ప్రాక్టీస్ చేశారు.
జానపద కళల శిక్షణ కోసం గురుకులం ఏర్పాటు
ఈ కార్యక్రమంలో కథక్ నృత్యం చేసి వరల్డ్ రికార్డు సాధించిన నృత్య కళాకారులను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు. 'ఖజురహోలో గిరిజన, జానపద కళల శిక్షణ కోసం దేశంలోనే తొలి గురుకులాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ గురుకులం గ్రామీణ సమగ్ర అభివృద్ధితో పాటు సాంప్రదాయ నైపుణ్యాలను రక్షించే విధంగా రూపొందుతుంది. దీనితో పాటు మన పూర్వీకుల వారసత్వం కూడా కాపాడుకుంటాం. ఈ నృత్యం భారతీయ సంస్కృతికి గర్వకారణంగా, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది' అని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒకేసారి 108 చోట్ల సూర్య నమస్కారాలు- న్యూఇయర్ రోజున గుజరాత్ గిన్నిస్ రికార్డ్
'మెమొరీ' మ్యాన్ అభయ్- 3 గిన్నిస్ రికార్డులు కైవసం- ఒక్క నిమిషంలోనే!