Karnataka Murder Case : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భార్య, మరికొందరితో కలిసి ఓ యాచకుడిని చంపాడు ఓ వ్యక్తి. అనంతరం రోడ్డు ప్రమాదంలో తానే చనిపోయినట్లు పోలీసులకు భార్యతో ఫిర్యాదు చేయించాడు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి అసలు నిజాన్ని రాబట్టిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
ప్రమాదంలో మరణిస్తే రూ.లక్షల్లో జీవిత బీమా వస్తుందని ఆశపడ్డాడు హోస్కోటేలోని చిక్కకొలిగ గ్రామానికి చెందిన మునిస్వామి గౌడ్. అందుకు అతడిలాగే ఉన్న ఓ యాచకుడి ఎంచుకుని హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. మునిస్వామికి అతడి భార్య శిల్పారాణి, ట్రక్కు డ్రైవర్ దేవేంద్ర నాయక్, మరో ఇద్దరు సహకరించారు. ఆగస్టు 13వ తేదీ వేకువజామున 3.15 గంటల సమయంలో గొల్లరహళ్లి గేటు సమీపంలో కారు టైరు మారుస్తుండగా దాన్ని ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో పోలీసులు దీన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా భావించారు. కారు, ట్రక్కును స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత ఈ ప్రమాదంలో మరణించింది తన భర్తేనని మునిస్వామి భార్య శిల్పారాణి పోలీసులను ఆశ్రయించింది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చూపించింది. తన భర్త రోడ్డుపై నిలబడి ఉండగా లారీ ఢీకొట్టిందని శిల్పా రాణి ఫిర్యాదు చేసింది. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది. పోస్టుమార్టం పరీక్షల్లో ప్రమాదవశాత్తూ యాచకుడు మరణించలేదని తేలింది. శిల్పారాణి ఇచ్చిన ఫిర్యాదుకు, దీనికి పొంతన లేకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ట్రక్కు డ్రైవర్ దేవేంద్రను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, వాస్తవాలు బయటపడ్డాయి. హత్యకు గురైన వ్యక్తి యాచకుడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మునిస్వామి గౌడ్ బతికే ఉన్నాడని తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మునిస్వామి, దేవేంద్రను అరెస్ట్ చేశారు. అందుకు సహకరించిన శిల్ప, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో తేలిందేంటంటే?
మునిస్వామి, అతడి భార్య శిల్ప ఓ వ్యక్తితో స్నేహం చేశారు. అతడు అచ్చం మునిస్వామిలానే ఉన్నాడు. ఆగస్టు 13వ తేదీన మునిస్వామిలాగే ఉన్న వ్యక్తిని సిడ్లఘట్టకు రమ్మన్నారు. ఆ తర్వాత కారు టైర్ పేలిపోయిందని, కొద్దిగా సాయం చేయమని యాచకుడ్ని అడిగారు. తాడుతో యాచకుడి గొంతుకి ఉరివేసి, వెనుక నుంచి వస్తున్న ట్రక్కు కిందకు తోసేశారు. అనంతరం మునిస్వామి అక్కడ నుంచి పరారయ్యాడు.
"మునిస్వామి గౌడ్ అనేక జీవిత బీమా పాలసీలు తీసుకున్నాడు. ఈ క్రమంలో తాను చేసేపోయేటట్లు నమ్మించి బీమా సొమ్మును కాజేయాలని ప్లాన్ చేశాడు. అందుకు మునిస్వామి గౌడ్ భార్య శిల్పారాణి, ట్రక్కు డ్రైవర్ దేవేంద్ర, సురేశ్, వసంత్ అనేవారితో కలిసి కుట్ర పన్నారు. యాచకుడి మృతదేహం వద్ద ఆధార్ కార్డు, గుర్తింపు పత్రాలను పథకం ప్రకారం ఉంచారు. రోడ్డు ప్రమాదంలో మరణించింది తన భర్తేనని భార్య శిల్పారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునిస్వామి గౌడ్, అతడి చంపిన వ్యక్తి ఒకేలా ఉన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నాం. మునిస్వామిగౌడ్, దేవేంద్ర, సురేశ్, వసంత్ దాదాపు ఆరు నెలల నుంచి ఈ ప్లాన్ను అమలు చేయాలని చూస్తున్నారు. చాలా సార్లు విఫలమయ్యారు. " అని హసన్ పోలీసు సూపరింటెండెంట్ మహ్మద్ సుజీత తెలిపారు.