Justice Hema Committee On Malayalam Film Industry : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ హేమ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధిపుల కథనాలు విని షాక్‌కు గురయ్యామని కమిటీ పేర్కొంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి, దోపిడీలు, అన్యాయానికి సంబంధించిన విషయాలు గురించి వివరిస్తూ ఈ నివేదికను రూపొందించారు.
నివేదికలోని కీలక విషయాలు
- లైంగిక కోరికలు తీర్చకపోతే సినిమాల్లో అవకాశం ఉండదు.
- చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు మత్తు మందులు సేవించి, నటీమణుల ఇళ్ల తలుపులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
- ఇలాంటి కేసుల్లో ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారు.
- ఎవరైనా నటీమణులపై కోపం ఉంటే వారికి శిక్షగా ఎక్కువగా రిపీట్ షాట్లు ఇస్తారు. ఓ నటికి ఒకే షాట్‌ను 17 సార్లు చేయించి వేధించారు.
- విపరీతంగా పురుష అహంకారం ఉంది.
- వాళ్లు అడిగినట్లుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను కోడ్ పేర్లతో పిలుస్తారు.
- ఏదైనా ఉద్యోగం చేయాలి, సినిమాల్లో నటించాలనే ఆశతో ఉన్న మహిళలు రాజీ పడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి.
- కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లుతుందని, ప్రాణాలకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు బయటకి రావడం లేదు.
- చిత్ర పరిశ్రమలో కనిపించే దాన్ని అసలు నమ్మవద్దు. ఉప్పు కూడా చక్కెరలా కనిపిస్తోంది.
- మలయాళ చిత్ర పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ నియంత్రణలో ఉంది.
2017లో ఓ నటిపై లైంగిక వేధింపులకు సంబంధించి నటుడు దిలీప్‌పై కేసలు నమోదైన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మలయాళం చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపులు, లింగ అసమానత సమస్యలపై అధ్యయనం చేయానికి జస్టిస్ హేమ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. అయితే జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్ట్‌ను 2019లో ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై మలయాళ చిత్ర నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నివేదిక విడుదల ఆగిపోయింది. తాజాగా సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌ను విడుదల చేయాలని ఆశ్రయించిన మీడియా కార్యకర్తలతో పాటు ఐదుగురు వ్యక్తులకు ఈ నివేదికను అందజేశారు.