Jnanpith Award Winners 2023 : సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యతోపాటు ఉర్దూ కవి, సినీ గేయ రచయిత గుల్జార్ 58వ జ్ఞానపీఠ్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ్ కమిటీ ఓ ప్రకటన చేసింది. 2023 సంవత్సరానికిగాను రెండు భాషలకు చెందిన ప్రముఖ రచయితలకు ఈ అవార్డు ప్రకటించినట్లు పేర్కొంది.
బహు భాషావేత్త జగద్గురు రామభద్రాచార్య
జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. వందకుపైగా పుస్తకాలను రచించడమే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. ఈయన హైందవ దర్మానికి సంబంధించి పలు సాహితీ రచనలు చేశారు. చిత్రకూట్‌లోని జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగుల కోసం విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. చిన్నతనంలోనే అంధత్వానికి గురైన రామభద్రాచార్య 22భాషలు మాట్లాడగలరు. కవి, రచయిత అయిన రామభద్రాచార్య సంస్కృతం, హిందీ, అవధీ, మైథిలీ భాషల్లో రచనలు చేశారు. ఆయన చేసిన విశిష్ఠమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషన్ పురస్కారంతో గౌరవించింది.
పలు సినిమాలకు గేయరచయితగా పనిచేసిన గుల్జార్
సినీగేయ రచయిత, ఉర్దూకవి గుల్జార్ 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2004లో పద్మవిభూషణ్, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌లు కూడా పొందారు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ స్వీకరించారు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ స్వీకరించారు. గుల్జార్ తన కెరీర్‌ను గేయ రచయితగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్డీ బర్మన్తో ప్రారంభించారు. ఆయనతో కలిసి 1963 లో బందిని సినిమాకు గేయాలను అందించారు. ఏఆర్ రెహ్మాన్, ఆర్డీ బర్మన్, సలీల్ చౌదరి, విశాల్ బరద్వాజ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. ఇవే కాకుండా పలు కవితలను కూడా రచించారు. ఈయన ప్రఖ్యాతి గాంచిన ఆనందీ, మౌసమ్ లాంటి సినిమాలతో పాటు మిర్జా గాలిబ్ టీవీ సీరియల్‌కు దర్శకత్వం వహించారు. 'గుల్జార్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంతో పాటు, సాహితీ రంగంలోనూ ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఆయన తన పద్యాల్లో నూతనత్వాన్ని సృష్టించారు. ఆయన తన జీవితంలో కొంత భాగాన్ని బాల సాహిత్యానికి కూడా కేటాయించారు' అని జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ ఎంపిక కమిటీ తన వెబ్సైట్లో పేర్కొంది. సాహిత్య రంగంలో విశేష సేవలు చేసిన వారికి ఈ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అయితే 2022లో ఈ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని దామోదర మౌజోకు అందించారు.