Jharkhand Assembly Election 2024 : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటములకు అగ్ని పరీక్షగా మారాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమి, జైరాం మహతో ఏర్పాటు చేసిన కూటమి ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. హిందుత్వతోపాటు జేఎంఎం నేతల అవినీతి అంశాలు ఇండియా కూటమిని కలవరపెడుతున్నాయి. దీంతోపాటు సోరెన్ కుటుంబంలోని నేతలు కొందరు బీజేపీలో చేరడం కూడా ఇబ్బందికరంగానే మారింది. శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్‌తోపాటు మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ బీజేపీలో చేరడం జేఎంఎంకు సవాలే.
మహిళల దారెటు?
ఝార్ఖండ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. మొత్తం 81 నియోజకవర్గాల్లోని 32 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. వారు ఎటు మద్దతిస్తారన్న అంశంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే అధికార పార్టీ జేఎంఎంవైపే మొగ్గు చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 'ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన' పేరుతో మహిళల ఖాతాల్లో నెలకు రూ.1000 ఇస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి పథకం విజయవంతమై బీజేపీకి భారీ విజయం సాధించి పెట్టిందని అంటున్నారు. అందుకే హేమంత్ సోరెన్ మహిళల ఓట్లను సాధించడంలో పైచేయి సాధించే అవకాశముందని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక మహిళల ఖాతాల్లో వేసే మొత్తాన్ని ఇంకా పెంచుతామనీ జేఎంఎం హామీ ఇస్తోంది. అయితే, ఝార్ఖండ్‌లో ఉపాధి అవకాశాల్లేక గిరిజన ప్రాంతాల్లోని పురుషుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. దీంతో స్థానికంగా ఉండే మహిళల పోలింగ్ అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇది జేఎంఎంకు సానుకూలమని చెబుతున్నారు.
మహతో సవాల్
జైరాం మహతో బొగ్గు గనుల ప్రాంతాల్లో యువతను భారీగా ఆకట్టుకుంటున్నారు. ఓబీసీలోని కుమ్రీ-మహతో వర్గంలో ఆయనకు పేరుంది. ఆయన స్థానిక అంశాలను లేవనెత్తుతున్నారు. భాష, ఉపాధి, పరీక్షల వంటి అంశాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అటు బీజేపీకి, ఇటు జేఎంఎంకు ఆయన పెద్ద తలనొప్పిగా మారారు. లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన మహతో కూటమి 3వ స్థానంలో నిలిచింది. భారీగా ఓట్లను సాధించింది.
బంగ్లాదేశ్ వలసలు
బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల అంశం బీజేపీ సంప్రదాయ ఓటర్లను ఐక్యం చేస్తోంది. అయితే దీనివల్ల కమల దళానికి కొత్తగా వచ్చే ఓటర్లెవరూ కనిపించడం లేదు. ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల బీజేపీకి ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయి. మిగిలిన ఓటర్లు పెద్దగా మొగ్గు చూపే అవకాశం లేదు.
గిరిజనుల సానుకూలత
రాష్ట్రంలోని ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ ఇటీవల ఓడిపోయింది. అదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తలెత్తవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి నాయకత్వ లేమి బీజేపీని ఇబ్బంది పెడుతోంది. గిరిజన ప్రాంతాల్లో జేఎంఎం పట్ల సానుకూలత ఉంది. అగ్రవర్ణాలవారు, ఓబీసీలు, ఎస్సీల ఓట్లను బీజేపీ ఏ మేరకు సాధిస్తుందనే దానిపైనే ఫలితాలు ఆధారపడనున్నాయి. దీంతోపాటు జైరాం మహతో కమల దళానికి ఇబ్బందికరంగా మారారు.