Jammu Kashmir Elections Congress Manifesto : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఎలక్షన్స్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ తాజాగా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. విజయం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోన్న కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకొనేందుకు పలు హామీలతో ఈ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.
శ్రీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, పీసీసీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఈ మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలను అందులో పొందుపరిచారు.
- ఈ ఎలక్షన్స్‌లో తమ పార్టీ విజయం సాధిస్తే అన్ని పంటలకు బీమా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ అలాగే కిలో యాపిల్‌కు కనీస మద్దతు ధర రూ.72 చొప్పున ఇస్తామని కూడా ప్రకటించింది.
- భూమిలేని, కౌలుదారులకు ఏడాదికి అదనంగా రూ. 4 వేలు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది.
- ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న భూమిలేని రైతులకు 99 ఏళ్ల లీజును కూడా ఇస్తామని వెల్లడించింది.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపింది.
- అర్హులు అయినవారికి నెలకు రూ.3500 చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇస్తామమని ప్రకటించింది.
- రైతులకు 100 శాతం సాగు నీరందేలా అన్ని జిల్లా స్థాయి నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.2,500 కోట్ల నిధిని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది.
ముగిసిన తొలి విడత ప్రచారం(Jammu Kashmir Elections Campaign) - జమ్మూ కశ్మీర్‌లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలకుగాను 24 అసెంబ్లీ స్థానాల్లో తొలి దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. దక్షిణ కశ్మీర్ అనంత్‌నాగ్, షోపియన్, పుల్వామా, కుల్గాం జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నేటితో ముగిసింది.